TDP MLA Kolikapudi Srinivas:  తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. తిరువూరు నియోజకవర్గంలో రమేష్ రెడ్డి అనే నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ అగ్రనేతలకు ఫిర్యాదు చేశానన్నారు. పది రోజుల కిందటే ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. రమేష్ రెడ్డి బాధితులు కొంత మంది కొలికపూడి శ్రీనివాస్ ను కలిసి..తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మాటలు విన్న కొలికపూడి శ్రీనివాస్..రమేష్ రెడ్డి వ్యవహారంపై తాను హైకమాండ్ కు పది రోజుల కిందటే ఫిర్యాదు చేశానన్నారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. బాధితుల కష్టాలు తీర్చలేకపోతే తనకు ఈ పదవి ఎందుకని ఆయన ప్రశ్నించారు.    

టీడీపీ హైకమాండ్‌కు 48 గంటల డెడ్ లైన్  తెలుగుదేశం పార్టీ పెద్దలకు కొలికపూడి శ్రీనివాస్  48 గంటల డెడ్ లైన్ పెట్టారు. ఈ లోపు చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తాన్నారు.  తిరువూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట లాంటిది. టీడీపీ గెలిచి చాలా కాలం అయింది. అక్కడ ఉన్న వర్గ పోరాటం ఇతర కారణాల వల్ల పార్టీ ఓడిపోతూ వచ్చింది. అందుకే ఈ సారి అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన  కొలికపూడికి.. పెద్దగా సంబంధం లేకపోయినా టిక్కెట్ ఇచ్చారు. అనూహ్యంగా విజయం సాధించారు. దాన్ని నిలబెట్టుకుని  అందర్నీ కలుపుకుని వెళ్లాల్సిన ఆయన..  అందరికీ దూరమవుతున్నారు.   

పలు వివాదాల్లో కొలికపూడి శ్రీనివాస్              

ఇప్పటికే కొలికపూడి శ్రీనివాస్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. రెండు సార్లు ఆయనపై చర్యలు తీసుకునేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధమయింది. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని పరిష్కరించుకుంటానని చెప్పి ఎలాగోలా పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆయన సైలెంట్ గా ఉండటం లేదు. ఇప్పటికే పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు ఇతర ముఖ్య నేతల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో కొలికపూడి శ్రీనివాస్ అందర్నీ కలుపుకుని వెళ్లి నియోజకవర్గంలో కీలక నేతగా ఉండాల్సిన ఆయన..  ఇతర పార్టీ క్యాడర్ తో  గొడవలు పెట్టుకోవడంతో దూరమవుతున్నారు.    

తిరువూరులో చాలా కాలం తర్వాత గెలిచిన టీడీపీ                                 

సాధారణంగా నియోజకవర్గాల్లో ఉండే ఆధిపత్య పోరు కారణంగా వచ్చే సమస్యలను ఎమ్మెల్యేలు తమకు తాము పరిష్కరించుకుంటారు. అయితే కొలికపూడి నేరుగా రాజకీయాల నుంచి ఎమ్మెల్యే కాకపోవడంతో ఆయన .. సమస్యల్ని పెద్దవి చేసుకుంటున్నారు. అన్నీ పార్టీ పెద్దలకు చేరేలా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు పార్టీ పెద్దలు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా తగ్గడం లేదన్న అభిప్రాయం టీడీపీలో వినిపిస్తోంది. పార్టీ గ్రామ స్థాయి నాయకులతో సమస్య వస్తే..  పార్టీ హైకమాండ్ కు డెడ్ లైన్ పెట్టేంత పిచ్చి పని ఎ ఏమ్మెల్యే చేయరని.. అదే ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని టీడీపీ నేతలు అంటున్నారు.