Viveka Murder Case: సీబీఐకి దేశంలో అందరూ భయపడుతుంటే.. ఏపీలో మాత్రం వైసీపీకి సీబీఐ భయపడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు విమర్శించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పక్కాగా దొరికిపోయినా.. సీబీఐ అరెస్టు  చేయలేకపోతోందని టీడీపీ సీనియర్ నేత అసహనం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచిన ప్రతీసారి ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటున్నాడని ఆరోపించారు. ఈ రోజు అమ్మకి ఆరోగ్యం బాగోలేదని, రేపు ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోయిందని చెబుతాడేమోనని బొండా ఉమా ఎద్దేవా చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి విచారణపై సీబీఐ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. దేశంలో ఎన్నో కేసులపై పని చేసిన సీబీఐ ఎవరికి అవినాష్ రెడ్డికి లాగా ఉదాసీనంగా వ్యవహరించి ఉండలేదని అన్నారు. 


'చిన్న చేపే ఇలా చేస్తే తిమింగలాలు ఏం చేస్తాయో'


ముందస్తు బెయిల్ కోసం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వందల కోట్లు ఖర్చు పెడుతున్నాడని, ఆయనకు అంత డబ్బు ఎవరు ఇస్తున్నారంటూ బొండా ఉమా ప్రశ్నలు గుప్పించారు. వివేకా కేసులో అవినాష్ రెడ్డి చిన్న చేపగా అభివర్ణించిన బొండా.. అసలు తిమింగలాలు ఇంకా ఉన్నాయని టీడీపీ నేత ఆరోపించారు. చిన్న చేపే సీబీఐని ఇలా చేస్తుంటే.. తిమింగలాలు ఏం చేస్తాయో అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వర రావు వ్యాఖ్యానించారు.


'పట్టువదలకుండా పోరాడితే దొంగలు బయటకు వస్తున్నారు'


'సొంత బాబాయ్ వివేకానంద హత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఎత్తులు, జిత్తులు అంటే జగన్ మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలి. ఈ రోజు కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచింది. మళ్లీ నాలుగు రోజులు సమయం అడిగాడు. దేశం మొత్తం సీబీఐకి అందరూ భయపడతారు. ఈ జే గ్యాంగ్, జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి అంటే సీబీఐ భయపడుతోంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం. రామ్‌సింగ్ అనే వ్యక్తి వీళ్ల దెబ్బకు ఎక్కడి వెళ్లారో కూడా తెలీదు. ఆయన మీద కేసులు పెట్టారు, బాంబులు వేస్తామన్నారు, జీపులు పేలుస్తామన్నారు. తర్వాత ఆయన వెళ్లిపోయారు. ఇవాళ జే గ్యాంగ్ దెబ్బకు సీబీఐ అల్లాడిపోతోంది. అలాంటి ఎత్తులమారి జిత్తులమారి జగన్ రెడ్డి కంటే ఎవరైనా ఉన్నారా అండీ. ఎన్నికల్లో గెలవటం కోసం.. బాబాయ్ ని డైరెక్ట్‌గా ఇంకెక్కడికో పక్క రాష్ట్రాలకో కాదు నేరుగా పైకి పంపించారు. ఎన్నికల్లో గెలిచాడు.. గెలవకముందు సీబీఐ విచారణ అన్నాడు, గెలిచాక సీబీఐ విచారణ అవసరం లేదన్నాడు. మేమేమో డీజీ ర్యాంకు, అడిషనల్ డీజీ ర్యాంకుతో సిట్ వేస్తే.. ఈయన మాత్రం హోంగార్డు, కానిస్టేబుల్ ర్యాంక్ సిట్ వేసి ఆ కేసును నిర్వీర్యం చేశాడు. వివేకా కుమార్తె సునీత పట్టుదలతో వందల సార్లు సీబీఐ అధికారులను కలిసి, హైకోర్టులో పిటిషన్ వేసి విచారణ ప్రారంభించేలా చేసింది. ఆమె చేసిన కృషి వల్ల ఇవాళ దొంగలందరూ బయటకు వస్తున్నారు' అని బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు.