Alliance Called For Praja Manifesto: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిగా పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి సంయుక్తంగా విడుదల చేయనున్న 'ప్రజా మేనిఫెస్టో'లో (Praja Manifesto) ప్రజలను సైతం భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టింది. మేనిఫెస్టోలో రూపొందించే ప్రధాన అంశాలపై సలహాలు, సూచనలను స్వీకరించేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు 'మీరు అడగండి.. మేము నెరవేరుస్తాం' అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. మేనిఫెస్టోపై సూచనలను 8341130393 నెంబర్ కు టెక్స్ట్ రూపంలో గానీ, వీడియోల రూపంలో, వాయిస్ మెసేజ్ కానీ, పీడీఎఫ్ లోనైనా పంపించొచ్చని కూటమి నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ఎన్డీయే కూటమి ఎజెండా అని స్పష్టం చేశారు. 






'దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు'


మరోవైపు, అటు, టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సత్తెనపల్లిలో ఆయన్ను కలిసిన దివ్యాంగులు తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దివ్యాంగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 'మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మ గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ హయాంలో ప్రతి ఏటా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించి వారిలోని ప్రతిభను గుర్తించేలా చేశాం. దివ్యాంగుల కోసం టీడీపీ అమలు చేసిన ప్రత్యేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తాం.' అని చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.






Also Read: Chandrababu: 'ఆ రౌడీమూకలకు నిద్ర పట్టడం లేదు' - క్రోసూరు ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం