Elections 2024 : ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై టీడీపీ మరోసారి విరుచుకుపడింది. జవహర్ రెడ్డి సీఎస్‌గా ఉండగా.. కౌంటింగ్ సక్రమంగా జరగదని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ారోపించారు. జవహర్ రెడ్డిని ఎన్నికల సంఘం ఎందుకు ప్రత్యేకంగా చూస్తోందని ఆయన ప్రశ్నించారు.  వివాదాల్లో ఉంటున్న వ్యక్తిని సీఎస్ గా ఎందుకు కొనసాగిస్తోందో చెప్పాలన్నారు. పెన్షన్ మరణాల సమయంలోనే సీఎస్ ను తొలగించాల్సిందని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. ఏం చేసినా చెల్లుతుందనే పరిస్థితికి చేరిన సీఎస్ పై ఎందుకు ఉపేక్షిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. 


నెలరోజుల్లో రిటైర్మెంట్ కానుండడంతో, ప్రభుత్వ ప్రాపకం కోసమే సీఎస్ ప్రయత్నిస్తున్నారని జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సీఎస్ జవహర్ రెడ్డి అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ముఖ్యమంత్రి కోసం దేనికైనా సిద్ధమనే రీతిలో సీఎస్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.   సీఎస్ పై భూకుంభకోణం ఆరోపణలపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కౌంటింగ్ రోజు ఇలాంటి వ్యక్తి చేతుల్లో అధికార యంత్రాంగం ఉండడం చాలా ప్రమాదకరం అని జీవీ ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు వస్తున్న ఆరోపణల నుంచి రక్షణ కోసం కౌంటింగ్ రోజున అధికార పార్టీకి కొమ్ముకాసే ముప్పు ఉందని హెచ్చరించారు.


మరో వైపు ఒకటో తేదీ వస్తున్నా వృద్ధుల పెన్షన్ల గురించి ఒక్క ప్రకటన కూడా చేయలేదని మరో నేత బొండా ఉమమహేశ్వరరావు ఆరోపించారు. పింఛన్ల పంపిణీపై ఇంకా ఒక్క ప్రకటన చేయని సీఎస్, సెర్ఫ్ సీఈ పై విరుచుకుపడ్డారు.  ఎన్నికల్లో వైసీపీకి మేలు చేసేందుకు పింఛన్ సొమ్ములు జగన్ తాబేదారులకు మళ్లిస్తున్నారని..  పింఛన్ కోసం ఎండలో మాడి వృద్ధులు మృత్యువాత పడుతున్నారని విమర్శించారు.  భోగాపురంలో భూములు కొట్టేయడంపై ఉన్న శ్రద్ధ... పేదకు పింఛన్ల పంపిణీపై లేదని సీఎస్ పై విరుచుకుపడ్ాు.  తప్పకుండా తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకుంటారు.. పింఛన్ దారులకు జూన్ 1నే పింఛన్ ఇచ్చేలా సీఎస్ వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని బొండా ఉమ హెచ్చరించారు.                 


సీఎస్ జవహర్ రెడ్డి ఇటీవ రెండు సార్లు విశాఖలో పర్యటించారు. అయితే ఆ పర్యటనలు రహస్యంగా సాగాయి. దీనిపై సమాచారం బయటకు రావడంతో విశాఖకు చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తాను సీఎస్ గా ఉండగా జారీ చేసిన ఓ జీవోను అడ్డం పెట్టుకుని ఎనిమిది వందల ఎకరాలకుపైగా అసైన్డ్ భూముల్ని కొట్టేశారని.. వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకే విశాఖ వచ్చారని ఆరోపించారు. ఈ ఆరోపణల్ని సీఎస్ జవహర్ రెడ్డి కొట్టి పారేశారు. మూర్తి యాదవ్ క్షమాపణ చెప్పకపోతే లీగల్ గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ మూర్తి యాదవ్ మాత్రం తన ఆరోపణలకే కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.