TDP  volunteers promise: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ఓ సంచలనం. పూర్తిగా యాభై ఇళ్లకు ప్రభుత్వం తరపున అధికార పార్టీ ప్రతినిధిగా వాలంటీర్ వ్యవహరించేవారు. అనేక సార్లు వివాదాస్పదమయింది.ఆ వాలంటీర్లు వైసీపీకి ఓట్లేసేలా ఓటర్లను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.  చివరికి ఇప్పుడు వాలంటీర్లు లేరు. ఈ ప్రభుత్వం రద్దు చేయలేదు. కానీ గత ప్రభుత్వంలోనే వారి గడువు ముగిసిపోయింది. మళ్లీ కొనసాగిస్తూ జీవో జారీ చేయలేదు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు వారిని ఉద్యోగాల నుంచి తీసేయబోమని ..పదివేలు జీతం ఇస్తామని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వారికి అన్యాయం జరుగుతోంది. 

Continues below advertisement

యాభై ఇళ్లకో వాలంటీర్ ను ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం 

 ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రామ/వర్డ్ వాలంటీర్లు' వ్యవస్థ ప్రతి 50 ఇళ్లకు   ఒక వాలంటీర్‌ను కవర్ చేసేలా రూపొందించారు.  2019లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ వ్యవస్థ, ప్రభుత్వ సేవలు డోర్‌ డెలివరీ కోసమని ప్రకటించారు.  అయితే పార్టీ పనులు, కుటుంబాల సమాచారం ఎక్కువగా సేకరించారని ఆరోపణలు వచ్చాయి. స్థానిక ఎన్నికల్లో ఓటర్లను బెదిరించడంలో కీలక పాత్ర పోషించారని టీడీపీ ఆరోపించింది. ఎన్నికల సమయంలో వాలంటీర్లు హాట్ టాపిక్ అయ్యారు. ఆ సమయంలో ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోకుండా వారిని తప్పించారు. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు..  టీడీపీ వస్తే వాలంటీర్లను తీసేయబోమని జీతం పెంచుతామని..  వారికి యాభై వేల వరకూ సంపాదించుకోవడానికి ఉపాధి చూపిస్తామని ప్రకటించారు. కానీ టీడీపీ గెలిచిన తర్వాత అసలు వాలంటీర్లను పట్టించుకోలేదు. 

Continues below advertisement

వారంతా వైసీపీ కార్యకర్తలు కావడంతో టీడీపీకి వ్యతిరేకత

వాలంటీర్లు అందరూ వైసీపీకి  ప్రైవేటు సైన్యంలా పనిచేశారని టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. వాలంటీర్లు అంతా తమ పార్టీ వారేనని వైసీపీ నేతలు చెప్పుకున్నారు. ఎన్నికల సమయంలో మెజార్టీ వాలంటీర్లు అందరికీ ఐదు వేలు పార్టీ తరపున ఇచ్చారు.  టీడీపీ వస్తే వాలంటీర్లు ఉండరని అంటున్నారు.   ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి వైసీపీని గెలిపించేందుకు ప్రయత్నించారు. వారిని కొనసాగించడం అంటే.. వైసీపీ కార్యకర్తలకు ప్రజల్ని అప్పగించడమేనని అనుకున్నారు. అందుకే ముందుగా ఇచ్చిన హామీని కూడా పట్టించుకోకుండా.. వాలంటీర్లను పక్కన పెట్టేశారు. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో వారు చేయించే పనులు చేస్తున్నారు. 

జగన్ హయాంలోనే ముగిసిపోయిన వాలంటీర్ల కాంట్రాక్ట్

ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో వాలంటీర్లపై వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. వారిని తీసేశారని మండిపడింది. కానీ  ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చే సరికే వాలంటీర్లు ఎవరూ లేరని తమ ప్రభుత్వం ఎవరినీ తొలగించలేదని శాసనండలిలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. వారి నియామక ఉత్తర్వులకు సంబంధించిన సమయం ముగిసిపోయినా వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు.  పొడిగింపు కోసం గత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో ఎవరూ అధికారికంగా వాలంటీర్లుగా లేరు. దాంతో ప్రభుత్వం కూడా వారిని కొనసాగించలేదు. 

పట్టించుకోని వైసీపీ - వాలంటీర్ల వల్లే ఓడిపోయామన్న భావన 

వాలంటీర్ల దురదృష్టం ఏమిటంటే.. వారి కోసం వైసీపీ కూడా పోరాడటం లేదు. ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించలేదు. వారికి తమ మద్దతు ఉంటుందని వైసీపీ నేతలు కూడా చెప్పడం లేదు. వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు  చాలా ఆశలు చూపించారు.  రాజకీయ నేతల్ని చేస్తానన్నారు.  ఇతర పనులు చేయకుండా ఐదు సంవత్సరాల పాటు వాలంటీర్లుగా పని చేయడం వల్ల..  జీవితంలో ఎదిగే అవకాశాన్ని కోల్పోయారు. మరి ఇప్పుడు వారి కోసం  వైసీపీ  మాట్లాడటం లేదు. అదే సమయంలో చాలా మంది వైసీపీ నేతలు..  తాము  వాలంటీర్ల వల్లే ఓడిపోయామని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా తాము వస్తే మళ్లీ వాలంటీర్లవ్యవస్థ తెస్తామని చెప్పలేకపోతున్నారు.అందుకే వారికి రెండు పార్టీల వైపు నుంచి అన్యాయం జరుగుతోంది.