తెలుగు దేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు రేపటి నుండి మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆయన రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు.


ప్రకాశం జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం
ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. మూడు రోజులపాటు ఆయన జిల్లాలో మకాం వేయనున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని నిర్వహించే కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో నాయకుల పని తీరు, ఆశావహులకు బాబు భరోసా వంటి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి క్రిష్ణా జిల్లా టూర్ ను పూర్తి చేసుకున్నారు. ఇప్పడు ప్రకాశం జిల్లా పర్యటనకు రెడీ అవుతున్నారు. మూడు రోజుల పాటు మూడు ప్రాంతాల్లో చంద్రబాబు రోడ్ షోలు, బహిరంగ సభలను నిర్వహిస్తారు.


19వ తేదీన చంద్రబాబు దివంగత నేత బీ. వీరారెడ్డి కి నివాళులర్పిస్తారు. మద్యాహ్నం వరకు ఆయన బద్వేల్ వీరా రెడ్డి కన్వెన్షన్ లోనే ఉంటారు. అనంతరం గాంధీబొమ్మ సెంటర్, గిద్దలూరుకు చేరుకొని అక్కడ నుండి రాచర్ల గేట్, ఆర్టీసీ డిపో మీదగా వినూత్న విద్యా నికేతన్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడ  బహిరంగ సభలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. 20వ తేదీన సాయంత్రం కుంభం రోడ్ జంక్షన్ నుండి చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారున. క్లాక్ టవర్ మీదగా ఎన్టీఆర్ సర్కిల్, ఎస్కేవీపీ కాలేజి గ్రౌండ్ వరకు చేరుకొని బహిరంగ సభ లో పాల్గొంటారు.


21వ తేదీన యర్రగొండపాలెం తెలుగు దేశం పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు సందర్శిస్తారు. సాయంత్రం రాళ్ళ వాగు వరకు రోడ్ షో నిర్వహించే అక్కడే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.


బీటెక్ రవికి భద్రత కుదింపు పై చంద్రబాబు అసహనం
కడప జిల్లా నేత, మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి కి భద్రత తొలగించడంపై తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. బిటెక్ రవికి భద్రత కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  కి చంద్రబాబు నాయుడు లేఖ వ్రాశారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగిసిందనే కారణంతో బిటెక్ రవి భద్రతను తొలగించడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. 2006 నుంచి బిటెక్ రవికి 1 ప్లస్ 1 సెక్యూరిటీ కవర్ ఉందని, రాజకీయ ప్రత్యర్థులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి రవికి నిరంతరం బెదిరింపులు ఉన్నందున భద్రత కొనసాగిందన్నారు.


ఎమ్మెల్సీగా ఎన్నికైన బిటెక్ రవికి 2+2 భద్రత కల్పించారని చెప్పారు. అయితే ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడాన్ని సాకుగా చూపి అతని భద్రతను తొలగించటం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. MLC పట్టభద్రుల నియోజకవర్గానికి పోలింగ్ జరిగిన మార్చి 13వ తేదీన అతని కాన్వాయ్‌ పై గూండాలు దాడి చేశారని, దాడిలో అతని కారు ధ్వంసమైందని, అయితే రవి తృటిలో తప్పించుకున్నారని చంద్రబాబు అన్నారు. వివేకా హత్య కేసులో బిటెక్ రవిని నిందితుడిగా చేర్చాలని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సమయంలో బిటెక్ రవికి ఏదైనా హాని జరిగితే పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కడప జిల్లాలో రాజకీయ పరిస్థితుల కారణంగా బిటెక్ రవికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.