TDP Janasena BJP Alliance: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడం తరువాయి అని రాజకీయ పరిణామాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఆ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై కూడా చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మార్చి మొదటి వారంలో పొత్తులపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంటే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనకు వెళ్లేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఇరువురు ఉండనున్నారు. బీజేపీ అధినాయకత్వంతో పొత్తులపై చర్చించనున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ భేటీ కానున్నారు. పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చించిన అనంతరం జేపీ నడ్డాతో కలిసి పొత్తులపై చంద్రబాబు, పవన్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తుపై దాదాపు క్లారిటీ వచ్చింది. ఇటీవల టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటన సందర్భంగా బీజేపీతో పొత్తు ఖాయమైందనేలా పవన్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ పొత్తులో కలిసి వస్తుండటం వల్ల తాను సీట్లను తగ్గించుకున్నట్లు పవన్ స్పష్టం చేశారు. తమ పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని తెలిపారు. ఇక బుధవారం తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభలో కూడా బీజేపీతో పొత్తు ఉంటుందంటూ పవన్ చెప్పేశారు. దీంతో మూడు పార్టీల పొత్తు లాంఛనమేనని తెలుస్తోంది.
టీడీపీ, జనసేన సీట్ల ప్రకటనకు కొద్ది రోజుల ముందు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. ఏపీలో బీజేపీతో పొత్తుపై సంప్రదింపులు జరిపారు. బీజేపీ కూడా పొత్తులో కలిసేందుకు రెడీగా ఉంది. చంద్రబాబుతో భేటీ తర్వాతి రోజు ఓ జాతీయ మీడియా ఛానెల నిర్వహించిన సదస్సులో ఏపీలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పొత్తులపై త్వరలోనే క్లారిటీ వస్తుందని, ఎన్డీయేలోకి కొత్త పార్టీలు వస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ, జనసేనతో పొత్తు గురించే అమిత్ ఆ తరహా వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జగన్‌ను ఎన్నికల్లో ఎదుర్కొవాలంటే బీజేపీ అండ కూడా అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో బీజేపీతో కలుపుకునేందుకు సిద్దంగా ఉన్నారు.
అయితే పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారనేది కీలకంగా మారింది. అసెంబ్లీ కంటే లోక్‌సభ సీట్లను ఎక్కువగా బీజేపీ ఆశిస్తోంది. బీజేపీకి 9 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలు కేటాయించే అవకాశముందని చెబుతున్నారు. జనసేన, బీజేపీకి కలిసి మొత్తంగా 33 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించేలా ఒప్పదం కుదిరినట్లు వార్తలొస్తున్నాయి. పొత్తులపై అధికారిక ప్రకటన తర్వాత రెండు, మూడు రోజుల్లో రెండో జాబితా విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఇందులో 99 సీట్లను అభ్యర్థులను ప్రకటించారు. జనసేన 24 సీట్లల్లో పోటీ చేయనుండగా.. తొలి జాబితాలో 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.