TDP And YSRCP Cadre Attack Each Other: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. కొన్ని రోజుల్లోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అయితే గెలిచిన ఉత్సాహంలో కొందరు టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు. వైసీపీ బలంగా ఉన్న చోట్ల తమకు ఓట్లు వేయలేదని దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 






టీడీపీ, జనసేన కార్యకర్తలు కత్తులు, కొడవళ్లతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల ఇళ్లలో దూరి దాడులకు తెగబడుతున్నారని వైసీపీ అధికారిక ట్విట్టర్‌లో వీడియోలు పోస్టు చేసింది. వెనుకబడిన వర్గాలపై టీడీపీ, జనసేన నేతలు దాడులకు దిగుతున్నారన్న విమర్శించింది.










రేషన్‌ వాహనాలు ధ్వంసం చేస్తున్నారు... ప్రశ్నించిన వారిని చంపేందుకు కూడా వెనకాడటం లేదని వైసీపీ ఆరోపించింది. తమ పార్టీకి భారీ మెజార్జీ వచ్చిందన్న పొగరో... లేక.. పవర్‌ చేతిలో ఉంటే.. తమను ఎవరూ  ఏమీ చేయలేరన్న ధీమానో కానీ... విచక్షణ మరిచి ఉన్మాదుల్లా మారి పేదలపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తింది. ఒకటి కాదు, రెండు కాదు... ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి 










కడప జిల్లా పులివెందులలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త.. ఆదిశేషు ఇంట్లోకి మారణాయుధాలతో ఆకతాయిలు చొరబడ్డాయి. ఇంట్లో ఉన్న మహిళలను బయటకు పంపి... ఆదిశేషుపై కత్తులతో దాడి చేశారు. భయానక వాతావరణం సృష్టించారంటూ.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో... ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కత్తులతో ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలను... బయటకు పంపారు. ఆ తర్వాత.. ఇంట్లో ఉన్న వ్యక్తిపై దాడికి తెగబడ్డారు. ఇది టీడీపీ గూండాల పనే అని బాధితులు అంటున్నారు.






తిరుపతి జిల్లా చంద్రగిరిలోనూ ఎన్నికల్లో గెలవగానే... వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడులకు దిగుతున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని ఓ దాబా దగ్గర వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణ వార్డు మెంబర్ వంశీపై... టీడీపీ నాయకులు మన్సూర్‌, చంద్రశేఖర్‌, ప్రసాద్‌కుమార్‌ రాజు, లోకేష్‌తోపాటు పలువరు దాడి చేశారని సమాచారం. చంద్రగిరి దాసరి వీధి సమీపంలో మండల వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు మస్తాన్‌పై కూడా టీడీపీ నాయకులు... కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది.






కళ్యాణదుర్గంలోనూ వైఎస్‌ఆర్‌సీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారని సమాచారం. ఆయన కారును ధ్వంసం చేసి... ఇంటిపైకి టీడీపీ గూండాలు రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది. ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామంలో వృద్ధిరాలిపై దాడి చేశారట. వృద్ధురాలిని కొట్టి... ట్రాక్టర్ కిందకి తోసేశారని వైసీపీ ఓ వీడియో పోస్టు చేసింది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు పరిధిలోని సూర్యారావుపేటకు చెందిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ యలమంచిలి ప్రవీణ్‌కు టీడీపీ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్‌కు నివాళులర్పించి... వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు వైసీపీ నేతల అబ్బయ్య చౌదరి. ప్రవీణ్‌ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.






ప్రభుత్వ ఆస్తులను కూడా టీడీపీ, జనసేన శ్రేణులు ధ్వంసం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బియ్యం పంపిణీ చేసే వాహనాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ ధ్వంసం చేస్తున్నారట. ప్రభుత్వ భవనాలు ముందున్న శిలాఫలకాలు, గ్రామాల్లోని వైఎస్‌ఆర్‌ విగ్రహాలను కూడా పగలగొడుతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. టీడీపీ-జనసేన శ్రేణుల దాడులకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.