Kuppam Tarakaratna  :  నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన నటుడు తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. ఒక్క సారిగా ఆయన సొమ్మసిల్లి పడిపోవడంతో తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు వెంటనే సమీప ఆస్పత్రికి తరంచారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం.. పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. ఎండ వల్ల డీ హైడ్రేషన్‌కు గుర్యయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తారకరత్న అస్వస్థత గురించి తెలిసిన వెంటనే... నందమూరి బాలకృష్ణ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుత తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 


తారకరత్న హఠాత్తుగా సొమ్మసిల్లి పడిపోవడంతో  గుండెపోటు లాంటివి ఏమైనా వచ్చి ఉంటాయన్న ప్రచారం జరిగింది. అయితే ఆయన పూర్తిగా డీ హైడ్రేట్ అవడం వల్ల ఇలాంటి సమస్య వచ్చిందని  భావిస్తున్నారు.  ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎలాంటి ప్రకటనా వైద్యులు చేయలేదు. విషయం తెలిసిన వెంటనే టీడీపీ ముఖ్య నేతలు.. అవసరం అయితే.. వెంటనే బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేశారు. తారకరత్నకు అస్వస్థత గురించి తెలిసిన వెంటనే.. టీడీపీ ఆస్పత్రికి వచ్చారు.  


తారకరత్న ఇటీవల రాజకీయంగానూ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.  చాలా సార్లు తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాననే ప్రకటనలు చేయలేదు. కానీ ఇటీవల రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేయాలని అనుకుంటున్నారు. తరచుగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో పర్యటించినప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో లోకేష్ తో కూడా సమావేశం అయ్యారు. కుప్పం వచ్చే ముందు బాలకృష్ణతో కలిసి హిందూపురం నియోజకవర్గంలోనూ పర్యటించారు. వరుసగా తీరిక లేకుండా.. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడంతో .. తారకరత్న అస్వస్థతకు  గురయినట్లుగా తెలుస్తోంది. 


తారకరత్న కోలుకోవాలని టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు. ఆస్పత్రి ఎదుట టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున గుమికూడారు. అవసరం అయితే  బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు పూర్తి వివరాలు ప్రకటించిన తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆస్పత్రికి వచ్చినప్పుడు పల్స్ లేదని కేసీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.  తారకరత్న శరీరం బ్లూగా మారిందన్నారు.   వెంటనే ట్రీట్ మెంట్ మొదలుపెట్టామని.. దాదాపుగా  45 నిమిషాల తర్వాత పల్స్ మొదలైందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తారకరత్న ఆరోగ్యం  మెరుగుపడుతుందని భావిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. అయితే అవి కార్డియాక్ అరెస్ట్ లక్షణాలా కాదా అన్నదానిపై వైద్యులు స్పష్టత ఇవ్వలేదు. 


తారకరత్నకు ఇంతకు ముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా లేవా అన్నదానిపై స్పష్టత లేదు. మొదట తారకరత్న స్ప్రహ తప్పగానే సమీపంలోని కేసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకు వచ్చే సరికే.. తారకరత్నకు పల్స్ లేదని.. వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో హుటాహుటిన .. పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి క్రిటికల్ గానే ఉందని.. కేసీ ఆస్పత్రి వైద్యులు చెప్పిన దాన్ని బట్టి అభిమానులు అంచనా వేస్తున్నారు.