Surya Prakash vs Anantha Sriram:  ప్రముఖ సినీ  పాటల రచయిత అనంత శ్రీరామ్ ,  ఆయన బంధువు చేగొండి సూర్యప్రకాష్ మధ్య మొదలైన ఆస్తి వివాదం ఇప్పుడు రాజకీయ, న్యాయపరమైన మలుపులు తిరుగుతోంది.  అనంత శ్రీరామ్ తన కుటుంబానికి రక్షణ కల్పించాలని, తన తల్లిదండ్రులను సూర్యప్రకాష్ బెదిరిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై సూర్యప్రకాష్   ఘాటుగా స్పందించారు. అనంత శ్రీరామ్ చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని, తనపై కావాలనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Continues below advertisement

అనంత శ్రీరామ్ తన డబ్బు, పరపతి,  రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తనను వ్యక్తిగతంగా వేధిస్తున్నారని సూర్యప్రకాష్ ఆరోపించారు. తనపై కక్షపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ క్రమంలోనే ఆయనపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు ప్రకటించారు. తన చరిత్ర నిష్కళంకమని, తనపై ఇప్పటివరకు కనీసం ఒక్క పోలీస్ కేసు కూడా లేదని ఈ సందర్భంగా సూర్యప్రకాష్ గుర్తు చేశారు. అనంత శ్రీరామ్ మాటలకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

అసలు వివాదం ఆస్తికి సంబంధించిందని సూర్యప్రకాష్ వివరించారు. తన తాతయ్య చేగొండి కృష్ణమోహన్ రావుకు చెందిన   ఆస్తిని అనంత శ్రీరామ్ అక్రమ మార్గాల్లో స్వాధీనం చేసుకున్నారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఆ ఆస్తిని కాజేసేందుకే తనను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని, అందుకే ఇలాంటి డ్రామాలు  ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంత శ్రీరామ్ ఒక "పెద్ద భూ కబ్జా రాయుడు" అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

అనంత శ్రీరామ్ తల్లిదండ్రులను తాను బెదిరించినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సూర్యప్రకాష్ తేల్చి చెప్పారు.  నేను వారిని బెదిరించినట్లు కనీసం ఒక్క ఆధారమైనా నిరూపిస్తే దేనికైనా సిద్ధం  అని ఆయన సవాల్ విసిరారు. లేనిపోని ఫిర్యాదులతో అధికారులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు. కేవలం తన స్వార్థం కోసం వృద్ధులైన తల్లిదండ్రులను ఈ వివాదంలోకి లాగడం సరికాదని ఆయన విమర్శించారు.

 ఒకవైపు అనంత శ్రీరామ్ తన తల్లిదండ్రులకు ప్రాణాలకు ముప్పు ఉందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, మరోవైపు సూర్యప్రకాష్ భూ కబ్జా ఆరోపణలు చేస్తూ కోర్టుకు వెళ్తామనడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై అధికారులు ఎలాంటి విచారణ జరుపుతారో ,పోలీసులు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.