Supreme Court quashes FIR registered against Raghuramakrishna Raju: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆయనపై నమోదైన కేసును సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. ఈ కేసు పెట్టింది.. ఏపీ పోలీసు ఇంటలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న కానిస్టేబుల్.ఇప్పుడు తాను ఆ కేసును కొనసాగించేందుకు ఆసక్తిగా లేనని చెప్పడంతో కేసును క్వాష్ చేశారు.                      

జగన్‌తో విబేధించడంతో హైదరాబాద్‌లోని ఆయన ఇంటిపై ఇంటలిజెన్స్ పోలీసుల నిఘా          

వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ తో విబేధించారు. దాంతో ఆయనను ఓ సారి హైదరాబాద్ నుంచి పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. అయితే ఆయన ఇంటి చుట్టూ ఎప్పుడూ ఏపీ ఇంటలిజెన్స్ పోలీసుల నిఘా ఉండేది. అలా ఓ సారి ఆయన ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని.. రఘురామకృష్ణరాజు భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. రఘురామకు కేంద్రం వై కేటగిరీ భద్రత ఇచ్చింది. ఆ భద్రతా సిబ్బంది.. అనుమానాస్పద వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. అయితే ఆ వ్యక్తి ఏపీ ఇంటలిజెన్స్ పోలీసుల విభాగంలో పని చేసే కానిస్టేబుల్ గా గుర్తించారు.         

అక్రమంగా నిర్బంధించారని గచ్చిబౌలి పోలీసులకు కానిస్టేబుల్ ఫిర్యాదు                  

తమ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని.. రెక్కీ నిర్వహిస్తున్నాడని రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఏపీ కానిస్టేబుల్ తనను అక్రమంగా నిర్బంధించారని దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో  గచ్చిబౌలి పోలీసులు రఘురామతో పాటు ఆయన కుమారుడిపైనా కేసు పెట్టారు.  ఈ కేసు తప్పుడు కేసు అని క్వాష్ చేయాలని  రఘరామ  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  కానీ క్వాష్ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. దాంతో ఆయన  సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.                

న్యాయం గెలిచిందని సంతృప్తి వ్యక్తం చేసిన రఘురామ 

తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగాడుతున్న వ్యక్తిని సందేహంతో ప్రశ్నిస్తే కేసులు పెట్టారని రఘురామ తరపు లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు.  రఘురామపై కేసు పెట్టిన ఏపీకి చెందిన కానిస్టేబుల్ కూడా .. దూరాభారం అవుతున్నందున తాను  కేసును కొనసాగించేందుకు ఆసక్తిగా లేనని తెలిపారు. దాంతో సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసింది. సుప్రీంకోర్టులో న్యాయం జరిగిందని..  రఘురామకృష్ణరాజు సంతృప్తి వ్యక్తం చేశారు. 

జగన్ సీఎంగా ఉన్నంత కాలం రఘురామ ఏపీలో అడుగు పెట్టలేకపోయారు. అడుగు పెడితే ఏదో ఓ కేసులో అరెస్టు చేసేవారని అనుకున్నారు. అయితే ఆయనను  ఓ కేసులో హైదరాబాద్ నుంచి అరెస్టు చేసి ఏపీకి తీసుకెళ్లారు. పోలీసులు భౌతిక దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ప్రస్తుతం ఏపీ పోలీసులు విచారిస్తున్నారు.