సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో క్యురేటివ్ పిటిషన్‌లపై స్పెషల్ బెంచ్ సమావేశం కానున్నందున నేడు లిస్ట్ అయిన పిటిషన్ల విచారణ వాయిదా పడింది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్ సైట్‌లో కూడా ఈ మార్పుల గురించి వెల్లడించారు. ఇవాళ (సెప్టెంబరు 26) ధర్మాసనం ఎదుటకు రావాల్సిన పిటిషన్లు రేపు (సెప్టెంబరు 27) లేదా వచ్చే వారానికి వాయిదా పడనున్నాయి. 


ఈ పిటిషన్లలో టీడీపీ అధినేత చంద్రబాబు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్లు కూడా ఉన్నాయి. సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 2 వరకూ మొత్తం 5 రోజుల పాటు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. ఒకవేళ రేపు విచారణ జరగకపోతే ఇక ఇవి వచ్చేవారమే ధర్మాసనం ముందుకు రానున్నాయి. చంద్రబాబు తరపు లాయర్లు తమ పిటిషన్ విచారణకు రేపు అనుమతి కోరినట్లు తెలుస్తోంది.


సెలవులో విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి


మరోవైపు, నేడు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి సెలవులో ఉన్నారు. దీంతో ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను విచారణ చేయాలని న్యాయవాదులు ఇన్‌ఛార్జి జడ్జిని కోరనున్నారు. 


రేపు విచారణకు చంద్రబాబు పిటిషన్


స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) బుధవారం (సెప్టెంబరు 27) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు తరఫు లాయర్లు దాఖలు చేసిన మెన్షన్‌ మెమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ .. రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ పిటిషన్‌ ఏ బెంచ్‌ ముందుకు విచారణకు వస్తుందో సాయంత్రానికి తెలియనుంది.


అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు పర్మిషన్ తీసుకోకుండానే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తనను అరెస్టు చేశారని, ఆధారాలు ఏవీ లేకుండా తనను ఇరికించారని చంద్రబాబు లాయర్లు పిటిషన్ లో పేర్కొన్నారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.