స్కిల్ డెవలప్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని ఎస్‌ఎల్‌పీలో కోరారు. తన పిటిషన్‌ను గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి కొట్టేయడాన్ని సవాలు చేస్తూ, చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతో చంద్రబాబు పిటిషన్‌పై ఇవాళే విచారణ జరిగే అవకాశం ఉంది. 


ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు, చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మెన్షన్‌ చేశారు. అత్యవసరం ఉన్నందున ఈ కేసుకు సంబంధించి మెన్షనింగ్‌ స్లిప్‌ ఇచ్చామని, పిటిషనర్‌ కస్టడీలో ఉన్నారని సిద్ధార్థ లూథ్రా చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేసని, అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్పందించిన సీజేఐ, మంగళవారం రావాలని సూచించారు. ఎప్పటి నుంచి ఆయన కస్టడీలో ఉన్నారని సీజేఐ ప్రశ్నించడంతో, 8న అరెస్టు చేసినట్లు సిద్ధార్థ లూథ్రా చెప్పారు. 


మరో వైపు మరో ఐదు రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు సూచించింది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌, సీఐడీ తాజాగా దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కలిపి ఒకేసారి విచారించి, రెండింటిపై ఒకేసారి నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది. వాదనలు వినేందుకు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధుల వినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం కారాగారంలో జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో సీఐడీ ప్రశ్నించింది.