Tirumala Laddu Controversy: సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామికి ఎదురుదెబ్బ.. కల్తీ నెయ్యి కేసులో ఏపీ సర్కార్ నిర్ణయం సరైనదే!
Tirumala Laddu Issue | సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ విచారణకు ధర్మాసనం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

Tirumala Laddu Controversy | న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ విచారణపై సుప్రీంకోర్టులో సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఏకసభ్య కమిషన్ తన విచారణను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది..
ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌లో సరైన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ వేదికలపై ప్రకటనలు చేస్తున్నారంటూ పిటిషనర్ తరపున వినిపించిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. పరిపాలన పరమైన అంశాలపై విచారణ జరిపించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో జరిగిన వైఫల్యాలు, లోపాలను గుర్తించి, బాధ్యులను తేల్చడానికే సిట్ (SIT) నివేదిక మేరకు ప్రభుత్వం ఈ కమిషన్‌ను నియమించిందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఏకసభ్య కమిషన్ విచారణకు లైన్ క్లియర్
ఈ తీర్పుతో ఏకసభ్య కమిషన్ విచారణతో పాటు, సిట్ దర్యాప్తు కూడా ఏకకాలంలో కొనసాగుతుందని స్పష్టమైంది. అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిగ్గు తేల్చడానికి ఏపీ ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై విచారణ మరింత వేగవంతం కానుంది.
తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి దినేష్ రెడ్డితో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సిట్ ఇచ్చిన నివేదికను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దీంతో పాటు, ఈ వ్యవహారంలో క్రిమినల్ కోణాన్ని విచారించడానికి సిట్ (SIT) బృందం కూడా రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు గతంలోనే ఈ అంశంపై విచారణ జరిపి, కేంద్ర దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలో విచారణ జరగాలని కొన్ని కీలక సూచనలు చేసింది. తాజా తీర్పుతో ఏపీ ప్రభుత్వం స్వతంత్రంగా జరిపించే విచారణకు కూడా లైన్ క్లియర్ అయింది.
























