అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ స్కూల్ విద్యార్ధులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని స్కూళ్లకు ఈ నెల 24వ తేదీ నుండి వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అకడమిక్ కేలండర్ ప్రకారం వెల్లడించిన ఈ సెలవులు పూర్తయిన అనంతరం జూన్ 12న స్కూల్స్ రీఓపెన్ చేయనున్నారు. సెలవుల సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రజలకు జాగ్రత్తలు సూచించారు.  చెరువులు, బావులు, కాలువల వద్ద ఈతకు వెళ్లి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జిల్లా విద్యాధికారులకు విద్యాశాఖ పలు కీలక సూచనలు జారీ చేసింది.

Continues below advertisement

విద్యా సంవత్సరం ముగిసేలోపు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు సమ్మర్ సీజన్‌లో భద్రతా చర్యలపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలు బావులు, నదులు, చెరువులు, కాలువల వద్దకు వెళ్లకూడదని విద్యార్థులకు స్పష్టం చేయాలని సర్క్యూలర్‌లో సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయట తిరగకూడదని, తిరిగితే వచ్చే అనారోగ్య సమస్యలను విద్యార్థులకు వివరించాలని పేర్కొంది.

పాఠశాల నోటీసు బోర్డులపై భద్రతా నియమాలను విధిగా ప్రదర్శించడంతో పాటు, తల్లిదండ్రులకు కూడా అవసరమైన సూచనలు చేయాలని ఏపీ స్కూల్ విద్యాశాఖ తెలిపింది. సెలవుల్లో పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని, ఎండ వేడి నుండి వారిని రక్షించుకోవాలని.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను కోరింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.

Continues below advertisement