Srisailam EO Lavanna : శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లు మొక్కిన  వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై ఈవో లవన్న వివరణ ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది నాది ఓకే ఊరు అని, మంత్రి పెద్దిరెడ్డి గురుస్వామి, నాకు గురుతుళ్యుడు కాబట్టి కాళ్లకు నమస్కారం చేశానని ఈవో లవన్న తెలిపారు. నేను తప్పుడు పని చేయలేదని, కొందరు ఈ ఘటనను వక్రీకరించి కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి గురుస్వామి కాబట్టి ఆయనలోని శివునికి మొక్కానన్నారు. దేవాలయం ఎస్కేట్ గేట్ లో పెద్దిరెడ్డి కాళ్లకు నమస్కరిచారని, గుడిలో మొక్కలేదన్నారు.  దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో టికెట్లు లేకుండా దర్శనానికి ఎవరిని పంపించవద్దని ఆదేశాలున్నాయని ఈవో లవన్న తెలిపారు. ఓ న్యూస్ ఛానల్ వాళ్లను టికెట్లు లేకుండా దర్శనానికి అనుమతించలేదని, అప్పటి నుంచి ఇటువంటి రాద్ధాంతం వేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లు టికెట్లు లేకుండా దర్శనానికి ఎన్నిసార్లు వెళ్లారో నా దగ్గర డేటా ఉందన్నారు. దేవాలయంపై తప్పుడు ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.  


"హిందు ధర్మంలో అందరిలో శివుడ్ని చూడండి అని ఉంది. రామచంద్రారెడ్డిది నాది ఒకే ఊరు. ఆయన గురుస్వామి. అందుకే ఆయన కాళ్లకు మొక్కాను. గురువు మొక్కడం తప్పా? శ్రీశైలం క్షేత్రాన్ని అభాసుపాలు చేయకండి. దేవాదాయశాఖ కమిషనర్ ఒక సర్య్కూలర్ ఇచ్చారు. ఎవరినీ టికెట్ లేకుండా అనుమతించవద్దని ఆ ఆదేశాలను పాటిస్తున్నాం. త్వరగా వెళ్లాలంటే టికెట్ తీసుకోవాలి. నేను దేవాలయ అభివృద్ధి కోసమే నేను పాటుపడుతున్నాను." -ఈవో లవన్న


మంత్రి పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన ఈవో లవన్న 


ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయ ఈఓ మరో వివాదంలో చిక్కున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన... స్వామి వారిని దర్శించుకోకుండా తన అభిమాన నేతకు ఘన స్వాగతం పలికేందుకు వెళ్లారు.  మల్లన్న దర్శనానికి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై తనకున్న అభిమానాన్ని చాటుకునే క్రమంలో స్వామి వారిని మరిచి రాజకీయ నాయకుడికి పెద్దపీట వేశారంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్నను దర్శించుకోకుండానే వెళ్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు. శివమాల ధరించి  ధరించి మరీ మంత్రి పెద్దరెడ్డి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇది చూసిన భక్తులు ఈవో తీరుపై మండిపడుతున్నారు.


శివభక్తులు ఆగ్రహం


మాలలో ఉండి.. స్వామివారి సన్నిధిలో రాజకీయ నాయకుడి ఆశీర్వాదం తీసుకోవడం ఏంటంటూ శివ భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శివమాల ధరించిన ఆలయ అధికారి.. మంత్రి కాళ్లను మొక్కడం సరికాదంటూ చెబుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న శ్రీశైల దేవస్థానం ఈవో లవన్నను సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మల్లన్న సాక్షిగా ఆలయ అధికారి లవన్న భక్తులకు క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాల నేతలు కోరుతున్నారు. గవర్నర్ విశ్వభుషన్ హరి చందన్ రానున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే ఆలయ ఈఓ లవన్న అవినీతి ఆరోపణలు, పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఈ క్రమంలోనే మరో వివాదంలో ఇరుక్కున్నారు. అంతేకాకుండా మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తిగా విఫలం కావడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఐపీ పాసులు అధిక సంఖ్యలో జారీ చేయడం సరికాదని చెబుతున్నారు.