Pawan Kalyan On Alliance : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పదేళ్లుగా ఒంటరిగానే పోరాడానన్నారు. తన బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానే వెళ్తానని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన 'యువశక్తి' సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకూడదన్నారు. నియంతను అందరూ కలిసికట్టుగా ఎదుర్కొవాలన్నారు. ఎవరితోనైనా గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే ముందుకు వెళ్తానన్నారు. పొత్తు కుదరకపోతే ఒంటరిగానే వెళ్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లేంత నమ్మకం ప్రజలు ఇస్తే తప్పనిసరిగా ఒంటరిగా పోటీచేస్తానన్నారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందడం అవసరం లేదన్నారు. వస్తే జనసేన లేకపోతే మిశ్రమ ప్రభుత్వం అని పవన్ కల్యాణ్ పొత్తులపై తేల్చేశారు.
చంద్రబాబుతో ఇదే మాట్లాడా
"పరిశ్రమలు పెట్టాలంటే వాటాలు అడిగితే ఎవరొస్తారు. ఉత్తరాంధ్రలో జీడి బోర్డు, కొబ్బరి బోర్డు పెట్టిస్తామన్నారు. మత్య్సకారుల కోసం జీవో 207 ను చింపేశాను. ఇప్పటికైనా మారికపోతే ఇంకైం చేయలేం. పోలీసులకు కనీసం టీఏ, డీఏలు కూడా ఇవ్వడంలేదు. పోలీసు ఉద్యోగులకు వయో పరిమితి ఐదేళ్లు పెంచాలి. టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడాను. అప్పుడు వైసీపీ నేతలు బేరాలు కుదిరిపోయాయని మాట్లాడారు. నేను చంద్రబాబుతో మాట్లాడితే రెండున్నర గంటలు ఏం మాట్లాడారని వైసీపీ నేతలు నలిగిపోయారు. ఈ సభలో చెప్తా వినండి. చంద్రబాబుతో భేటీలో పోలవరం, ఐటీ, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏపీ భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నాం. వైసీపీ అద్భుతమైన పాలన చేసుంటే నేను విమర్శించేవాడినే కాదు. గతంలో టీడీపీని తిట్టావ్ కదా అని విమర్శిస్తున్నారు. ఇంట్లో మన సొంత వాళ్లతో గొడవపడతాం మాట్లాడడం మానేస్తామా? రాజకీయాల్లో ఒక వ్యూహం ఉండాలి." - పవన్ కల్యాణ్
గౌరవం తగ్గకుండా ఉంటే కలిసి పనిచేస్తా
"చంద్రబాబుతో సీట్ల గురించి మాట్లాడలేదు. ఒంటరిగా వెళ్లి వీరమరణం అవసరంలేదు. ఒంటరిగా వెళ్లే ధైర్యం ఇస్తే తప్పకుండా ఒంటరిగా పోటీ చేస్తాను. ఇప్పుడు మీ వెంటే ఉన్నాం అంటారు. ఆ తర్వాత మా కులం అన్నా, మా అమ్మ చెప్పాడు, నాన్న చెప్పాడని ఓట్లు వాళ్లకు వేస్తారు. మిమల్ని నమ్మి నేను రాజకీయాల్లోకి దూకేశాను. అందుకు నాకు తెగిపోయింది. మా ఇంట్లో నన్ను తిడుతుంటారు. జనాన్ని నమ్మి ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లావని తిడుతుంటారు. నా కుటుంబం అనుకుని రాజకీయాల్లోకి వచ్చాను. నా కుటుంబమే నాకు అండగా నిలబడలేకపోతే నేనేం చేయను. నేను దశాబ్దంపాటు ఒంటరిగా ఉన్నాను. నాకు క్షేత్రస్థాయిలో ఒంటరిగా నిలబడే అంత ధైర్యం ఇస్తే కచ్చితంగా ఒంటరిగా ఎదుర్కొంటాం. మనకు గౌరవం తగ్గకుండా ఉంటే కలిసి పనిచేస్తాం. లేదా ఒంటరిగానే వెళ్తాం."- పవన్ కల్యాణ్