Minister Dharmana Prasadarao : మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఆగ్రహం వచ్చింది. ఒక్కసారిగా చేయి లేపి కార్యకర్తకు ఒక్కటిచ్చారు. మంత్రి గారికి ఇంత ఆగ్రహం రావడానికి కారణం ఉందండోయ్. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు వైసీపీ కార్యకర్తలు, అనుచరలు ఘనంగా స్వాగతం పలికారు. ధర్మాన ప్రసాదరావుకు నిన్న సిక్కోలులో వైసీపీ నేతలు అభినందన సభ నిర్వహించారు. అంతకుముందు భారీ ర్యాలీలో ధర్మాన సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కరచాలనం చేయటానికి కార్యకర్తలు ఎగబడ్డారు. ఓ కార్యకర్త ధర్మాన చేయి పట్టుకుని వదలక పోవటంతో మంత్రి గారికి చిర్రెత్తుకొచ్చింది. సదరు కార్యకర్తపై ఒక్కసారిగా చేయి చేసుకున్నారు. ఈ ఘటనతో అక్కడున్న కార్యకర్తలంతా ఆవాక్కాయ్యారు. 



రెవెన్యూ శాఖలో అవినీతి 


అనంతరం సభలో మంత్రి ధర్నాన మాట్లాడుతూ వయోభారం కారణంగా రాజకీయాల నుంచి తప్పుకుని కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనిపిస్తోందన్నారు. అయితే ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఆ పనిచేయకుండా కట్టిపడేస్తున్నాయన్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం పార్టీ శ్రేణులు అభినందన సభ ఏర్పాటుచేశాయి. ఈ సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖలో అవినీతిని పేరుకుపోయిందని దానిని నిర్మూలించేందుకు కృషి చేస్తానన్నారు. అవినీతిని నివారించేందుకు సీఎం జగన్ మార్గదర్శకాలతో బ్యాంకుల నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యే విధానాన్ని అమలుచేస్తున్నారన్నారు. అయినప్పటికీ అవినీతి తగ్గుముఖం పట్టలేదని, ఇది సిగ్గు పడాల్సిన విషయమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కులాన్ని, మతాన్ని చూసి ఓట్లు వేసే రోజులు ఇప్పుడు లేవన్నారు. నిజాయితీగా పనిచేస్తేనే ప్రజలు నమ్ముతున్నారన్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపే ఇందుకు నిదర్శనమని మంత్రి అన్నారు. 


అనుచరుల అత్యుత్సాహం 


కొత్త మంత్రుల అభినందన ర్యాలీల్లో వైసీపీ కార్యకర్తలు, పోలీసులు అత్యుత్సాహం విమర్శలకు దారితీస్తుంది. ఇటీవల మంత్రి పినిపే విశ్వరూప్ అభినందన ర్యాలీలో నోట్ల కట్టలు వెదజల్లడం, బైక్ స్టంట్స్ చేయడం విమర్శలకు దారితీసింది. కిలో మీటర్ల పొడవున బైక్ లతో ర్యాలీ చేయడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఉషా శ్రీ చరణ్ ర్యాలీ కారణంగా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో సకాలంలో వైద్యం అందక ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మంత్రులే ఇలా ప్రవర్తిస్తే ఎలా అని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటున్నారు.