Minister Dharmana Prasadarao : రాజకీయ వ్యాపారవేత్త చంద్రబాబుకు పవన్ కల్యాణ్‌ మద్దతు తెలుపుతున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళంలో  మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నప్పుడు కొంద‌రి మ‌హానుభావుల పేర్లు చెబుతున్నారని, శ్రీ‌శ్రీ‌, వంగ‌పండు, గిడుగు రామ్మూర్తి పంతులు, చాగంటి సోమ‌యాజులు త‌దితరుల పేర్లు ప్రస్తావించారన్నారు. వారంతా ఎంత నిదానంగా ఉన్నత ల‌క్ష్యంతో ఉన్నారు. పవన్ ఓ వైపు ఆ పుస్తకాలు చ‌దివాను అంటున్నారు కానీ గొప్ప భావజాలాన్ని ఒంట‌ప‌ట్టించుకున్న విధంగా మాట్లాడ‌డం లేదని విమర్శించారు. సీఎం జ‌గ‌న్ అమలు చేస్తున్న పథ‌కాలు, ముఖ్యమంత్రి ఆలోచ‌న‌లు ఏంతో తెలుసుకోవాలని హితవు పలికారు. వైసీపీ ప‌థ‌కాలు ఎవరికి చేరుతున్నాయో చూసి మాట్లాడాలన్నారు.  


ఉత్తరాంధ్ర ప్రజల నోరు నొక్కి 


"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడ‌పోక ముందు ఓ క‌మిటీని నియ‌మించింది. శ్రీ కృష్ణ క‌మిష‌న్ ఏం చెప్పిందో పవన్ ఎన్నడ‌యినా చ‌దివారా? క్యాపిటల్ గురించి  శివరామకృష్ణ క‌మిష‌న్ నివేదిక‌ను స్టడీ చేశారా? ఏ కాంటెక్ట్స్‌లో రాష్ట్రం ఇమ్మన్నాను అంటే 65 సంవ‌త్సరాల ఓ ప్రాంత ప్రజ‌ల నోరు నొక్కి ప్రభుత్వ ధనాన్ని ఓ ప్రాంతానికి కేటాయించి అభివృద్ధి చేస్తే, ఆ విధంగా చేసి క‌ట్టు బ‌ట్టల‌తో రావాల్సి వ‌చ్చింది. మ‌ళ్లీ అటువంటి సిట్యువేష‌న్ రాకుండా ఉండేందుకు నేను కాదు శ్రీ కృష్ణ క‌మిటీ కానీ శివ రామకృష్ణ క‌మిష‌న్ కానీ అదే చెబుతున్నాయి.  డీ సెంట్రలైజేష‌న్ గురించి చెప్పాయి." - మంత్రి ధర్మాన


అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం


అమ‌రావ‌తిలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామ‌ని చెబుతున్నారని మంత్రి ధర్మాన విమర్శించారు. అది వ‌ద్దు పరిపాల‌న వికేంద్రీక‌ర‌ణపై తన అభిప్రాయం చెప్పానన్నారు. ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా పాల‌న రాజ‌ధానిగా విశాఖ‌ను  చేయాల‌ని ప్రభుత్వమే నిర్ణయించిందన్నారు. రాజాం వ‌చ్చాక ఒకటే రాజ‌ధాని అని చంద్రబాబు అంటున్నారని, ఇది త‌గ‌దు మ‌ళ్లీ ఓ యాభై ఏళ్లు  మేం వెన‌క్కు పోవాల్సి వ‌స్తుందని, అందుకే మా రాష్ట్రం ఇచ్చేయండి అన్నానని మంత్రి ధర్మాన వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు అమరావతికే కట్టుబడి ఉంటే మళ్లీ ఉత్తరాంధ్ర యాభై ఏళ్లు వెన‌క్కి పోవ‌డం ఖాయమన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వ‌చ్చి ఇక్కడి వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓ ప్రాంత ప్రయోజ‌నం కోసం తాను మాట్లాడుతున్నానన్నారు. అమ‌రావ‌తి కొంద‌రు క్యాపిట‌లిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్నదని విమర్శించారు . ఉత్తరాంధ్ర తిరుగుబాటు గ‌డ్డ అని, ఆక‌లి, క‌న్నీళ్లు  చూసిన గ‌డ్డ అన్నారు. తాను మాట్లాడ‌క‌పోయినా మరొకరు ఈ ప్రాంతం గురించి మాట్లాడతారని తెలిపారు.  


భూకబ్జా ఆరోపణలపై


"ప్రజలంతా యాక్సెప్ట్ చేసిన మోడ‌ల్ డీ సెంట్రలైజ్డ్ మోడ‌ల్. మీరు మ‌ళ్లీ ఒకే రాజ‌ధాని అని అమ‌రావ‌తి కోసం నిధులు వెచ్చిస్తాం అంటే మేం క్లైమ్ చేస్తాం.  ఒక యాభై ఏళ్లు మ‌ళ్లీ వెన‌క్కి పోతాం. ఓ రాజ‌కీయ పార్టీగా మా ఆవేద‌న ను అర్ధం చేసుకోండి. నిజాయితీ అయిన రాజ‌కీయాల‌కు మ‌ద్దతు ఇవ్వండి.  ఇటీవ‌ల కాలంలో దేశంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్రతిబింబించిన ఫ‌లితాలు కూడా అదే ! మీరు ఆ విధంగా విన్నవించ‌డంలో త‌ప్పు లేదు. చంద్రబాబు గురించి మీకున్న అభిప్రాయం చెప్పండి. 19 ఏళ్ల కింద‌ట ఆయ‌న ఎలాంటి వారు అన్నది తెహ‌ల్కా డాట్ కామ్ చెప్పింది.  పవన్ కూడా చంద్రబాబుతో కొన్నాళ్లు ప్రయాణించారు. మీకు కూడా ఆయ‌న గురించి తెలిసే ఉంటుంది. ఉత్తమ సాహిత్యం చ‌దివేం అని చెప్పేవారు ఎంత నిదానంగా ఉండాలి. మీరు స‌హ‌నం కోల్పోయారు. కొద్ది మంది ధ‌న‌వంతుల వైపు ప‌నిచేసిన చంద్రబాబుకు మీరు మ‌ద్దతు ఇస్తున్నారు. కోట్లాది మంది పేద‌ల క‌న్నీళ్లు తుడిచిన జ‌గ‌న్ కు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నా రు. నేను సైనికుల భూమిని క‌బ్జా చేశానని అంటున్నారు. ఒక సైనికుడికి అసైన్డ్ భూమి ఇస్తే ప‌దేళ్ల త‌రువాత ఆ భూమి అమ్ముకోవ‌చ్చు. ఎవ్వరైనా ఆ విధంగా చేస్తే ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంటుంది. రెవెన్యూ మినిస్టర్ కు భూములు కేటాయించే నిర్ణయాధికారం లేదు." - మంత్రి ధర్మాన ప్రసాదరావు 


అందుకే ప్రత్యేక రాష్ట్రం 


" అమ‌రావ‌తిలో వ్యాపారం చేస్తామంటే ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నాం. ఎందుకంటే మ‌రో యాభై ఏళ్లు రెవెన్యూ అంతా అక్కడే పెడ‌తారు కాబట్టి. అప్పుడు మ‌ళ్లీ ఉత్తరాంధ్ర వెనుక‌బ‌డే ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజ‌ల రాజ‌కీయ ప్రయోజ‌నాలు, వారి స్థితిగ‌తులు తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడ‌ుతున్నాను. ఇత‌ర జిల్లాల‌తో స‌మానంగా శ్రీ‌కాకుళం జిల్లా ఎద‌గాలి. భావ‌న‌పాడు కోసం ఇప్పటికే భూ సేక‌ర‌ణ చేశాం. అదేవిధంగా మ‌రికొన్ని అభివృద్థి ప‌నుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. భూముల తాకట్టు పెట్టి ఏం చేశారు ? జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ట్టుకు పోయారా? విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడ‌డం లేదు అని అంటున్నా రు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం పాల‌సీ. ఇప్పటికే కొన్ని సార్లు కేంద్ర పెద్దల‌ను క‌లిసి విన్నవించాం. కానీ ఆ పాల‌సీ విష‌య‌మై కేంద్రం ఓ స్పష్టమ‌యిన వైఖ‌రితో ఉంది. దీనిని నిలువ‌రించే వీలు లేద‌న్న విధంగా ఇప్పటి ప‌రిణామాలు ఉన్నాయి." అని మంత్రి ధర్మాన అన్నారు.