Suryanarayana Swamy Special Darshan For Locals In Arasavalli: రథసప్తమి ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యుని దర్శించుకోవడం పరిపాటిగా వస్తోంది. దాతలు, వీవీఐపీలు, వీఐపీలు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామిని దర్శించుకుంటారు. ఈసారి రథసప్తమి ఉత్సవాల సందర్భంగా అరసవల్లిలో నివాసముంటున్న స్థానికులకు ప్రత్యేక దర్శనం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. పూర్వం నుంచి అరసవల్లిలో నివాసముంటూ స్వామి సేవలో, ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న స్థానికులకు సూర్యజయంతి రోజున స్పెషల్ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గతంలో ఎన్నడూ లేని విధంగా రథసప్తమి రోజున స్థానికులకు ఆదిత్యుని దర్శనభాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అరసవల్లిలోని బ్రాహ్మణ వీధి, బొంపాడ వీధి, వెలమ వీధి, కాపు వీధి, శెగిడి వీధి, హరిజన వీధి వాసులకు ప్రత్యేకంగా పాసులు జారీ చేయనున్నారు. సచివాలయాల సిబ్బందితో ఇప్పటికే ఎమ్మెల్యే శంకర్ మాట్లాడి స్థానికంగా నివాసముంటున్న కుటుంబాల జాబితాను సిద్ధం చేశారు. ఆయా కుటుంబాల వారికి పాసులు జారీ చేసి రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామిని వారు దర్శించుకునేలా చర్యలు చేపడుతున్నారు.


ప్రత్యేక పాసులతో పాటు ఆధార్ కార్డులను తీసుకుని వారు దర్శనానికి రావాల్సి ఉంటుంది. ఇది వరకు స్థానికులు సైతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మాదిరిగానే స్వామి వారిని దర్శనం చేసుకునేవారు. వారికి ఎటువంటి ప్రాధాన్యత కూడా దర్శనాల విషయంలో లభించేది కాదు. ఈసారి రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న తరుణంలో స్థానికులను గుర్తించి ప్రత్యేకంగా పాసులు జారీ చేసి దర్శనభాగ్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తుండడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ చొరవను వారంతా కొనియాడుతున్నారు.


అటు, 3 రోజుల పాటు నిర్వహించబోయే రథసప్తమి ఉత్సవాలు విజయవంతం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గొండు శంకర్ కృషి చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆయన ఉత్సవ ఏర్పాట్లు, ఆ సందర్భంగా జరుగుతున్న పనులు పర్యవేక్షించడంలో బిజీబిజీ అయిపోయారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చేస్తున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారికి సూచనలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులతో మాట్లాడుతూ ఏర్పాట్లలో భాగస్వామ్యం అవుతున్నారు. ఉత్సవాలు జరిగే వరకు కూడా ఆయన అరసవల్లిపైనే దృష్టి సారించేలా ముందుకు సాగుతున్నారు.


గత అనుభవాల దృష్ట్యా..


రథసప్తమిని ఈసారి మూడు రోజుల పాటు రాష్ట్ర పండుగగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా ఉండడంతో అరసవల్లి పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకైతే మాత్రం దర్శనం భాగ్యం దొరకట్లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరసవల్లిలో మొత్తం కలిపి 34 వేల మంది ఉన్నారు. వీళ్లందరికీ కూడా ఒకే సమయం ఇచ్చి ఆ సమయంలో లోపలికి వెళ్లాలని దర్శనానికి ఏర్పాట్లు చేయించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిసారీ రథసప్తమి వస్తుందంటే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హడావుడి అంతాఇంత కాదు. కానీ ఈసారి ఎలా జరుగుతుందో మనం కూడా వేచి చూడాలి.