Somu Letter To CM jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇంతవరకు ఎంతమంది సమస్యలు పరిష్కరించారో సీఎం జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఆ హామీ ఇచ్చి మూడున్నర ఏళ్లు దాటినా ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు ఆరు నెలల్లో న్యాయం చేస్తానని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ
ఆంధ్రప్రదేశ్‌లో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సెప్టెంబర్ 6వ తేదీన అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆక్రందన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అగ్రిగోల్డ్ ఖాతాదారులు చెమటోడ్చి పొదుపు చేసుకున్న నగదుతో యాజమాన్యం వేలకోట్ల ఆస్తులు పెంచుకొని జల్సాలు చేస్తున్నారని బాధితుల తరపున పోరాడుతున్న నేతలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలలో అగ్రిగోల్డ్ సమస్య ఉందన్నారు.
హామీ ఇచ్చి జగన్ మోసం చేశారంటున్న బాధితులు
తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా ఇరవై వేల లోపు ఉన్న బకాయిలను చెల్లిస్తామని అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. మూడు మాసాల్లోగా పదకొండు వందల ఎనభై కోట్లు విడుదల చేస్తామని తన పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారని కానీ ఇప్పటి వరకూ ఇవ్వలేదని బాధితులుఅంటున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల తరపున రాజకీయ పార్టీలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. కేవలం 20 శాతం మంది సమస్యలు మాత్రమే పరిష్కారమయ్యాయని మిగిలిన 80 శాతం సమస్యలు పరిష్కారం కావాలని బాధిత సంఘాల నేతలు అంటున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.3 వేల కోట్లు బటన్ నొక్కి విడుదల చేయాలని వారు కోరుతున్నారు.
ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్!
అగ్రిగోల్డ్ డైరెక్టర్లంతా కలిసి రూ. 6,400 కోట్లు స్కామ్‌కు పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో డిపాజిటర్లను అగ్రిగోల్డ్ యాజమాన్యం అడ్డంగా ముంచింది. అలా వచ్చిన సొమ్ముతో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారు. కాగా, అగ్రిగోల్డ్ స్కామ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంట్లో పెట్టుబడి పెట్టి ఎంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. కొంతమంది అయితే నష్టపోయామనే మనస్తాపంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయితే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ నాటి ఉమ్మడి హైకోర్టు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని సూచించింది. అయితే ఈ కేసు విషయం ముందుకు సాగడం లేదు. ఆస్తుల వేలం జరగడంలేదు.
ఆస్తులు అమ్మితే రూ. 30వేల కోట్లు వస్తాయన్న వైఎస్ఆర్‌సీపీ !
తెలుగుదేశం పార్టీ హయాంలో అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలపై వైఎస్ఆర్‌సీపీ పోరాటం చేసింది. ఆస్తులు రూ. 30వేల కోట్ల విలువ ఉంటాయని.. అతి తక్కువకే కొట్టేస్తున్నారని ఆరోపించింది. ఈ ఆస్తులను కొనుగోలు చేయడానికి జీ సంస్థ ముందుకు వచ్చింది. కోర్టులో నగదు డిపాజిట్ చేసింది. కానీ.. ప్రతిపక్షం అత్యంత విలువైన ఆస్తులను తక్కువకే కొనుగోలు చేస్తోదంని తీవ్ర ఆరోపణలు చేయడంతో జీ సంస్థ విత్ డ్రా చేసుకుంది. ఆ తర్వాత అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం కొనసాగలేదు. బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. పాదయాత్రలో హామీ ఇచ్చినట్లుగా కూడా సీఎం జగన్ నిధులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు బాధితులు పోరుబాట పడుతున్నారు. ఏపీ బీజేపీ ఈ అంశంపై పోరాడాలని అనుకుంటోంది.