SIT officials questioned Narayana Swamy for six hours: మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామికి రిలీఫ్ లభించింది. సిట్ అధికారులు ఆయనను విచారణ తరవాత అరెస్టు చేస్తారని జరిగిన ప్రచారారానికి తెరపడింది. నారాయణ స్వామి నివాసంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు, ఇతర అంశాలు, లిక్కర్ స్కాంకు సంబంధించి పలు అంశాలపై విచారణ నిర్వహించారు. కొన్ని డాక్యుమెంట్లను అడిగి తీసుకుని నారాయణ స్వామి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణ అనంతరం సిట్ అధికారులు విజయవాడకు వెళ్లిపోయారు.
అనారోగ్యం పేరుతో విచారణకు రాకపోవడంతో ఇంటికే వెళ్లిన సిట్
గతంలో పలుమార్లు విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన హాజరు కాలేదు. తనకు ఆరోగ్యం బాగోలేదని చెబుతూ వస్తున్నారు. నారాయణ స్వామి విచారణకు హాజరు కాకపోవడంతో నేరుగా ఆయన నివాసంలోనే విచారణ చేపట్టిన సిట్.. కీలక విషయాలను రాబట్టింది. విచారణకు సహకరించలేదు కాబట్టి అరెస్టు చేస్తారని అనుకున్నారు. కానీ సిట్ అధికారులు అడిగిన అన్ని వివరాలను ఆయన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సిట్ విచారణకు పూర్తిగా సహకారం అందించానని..సిట్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని విచారణ తర్వాత మీడియాకు తెలిపారు. భవిష్యత్ లోనూ పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.
గత ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రి - కానీ నిమిత్తమాత్రంగానే అధికారాలు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితుడు అయిన నారాయణ స్వామికి గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాను జగన్ ఇచ్చారు. అలాగే ఎక్సైజ్ శాఖను ఇచ్చారు. అయితే పేరుకు ఆయన ఎక్సైజ్ శాఖా మంత్రే కానీ నిర్ణయాల్లో ఎప్పుడూ పెద్దగా ఆయన ప్రమేయం ఉండేది కాదని అధికారవర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ పాలసీపై ఇతరులు చర్చించారు కానీ ఆ చర్చల్లో ఎక్సైజ్ మంత్రిని ఎప్పుడూ భాగస్వామ్యం చేయలేదని తెలుస్తోంది. అయితే ఎక్సైజ్ మంత్రిగా కొన్నినిర్ణయాలకు ఆయన సంతకాలు తప్పని సరి. ఈ క్రమంలో ఆయన తసుకున్న నిర్ణయాలు.. లిక్కర్ అంశంపై.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అంశాలపై పూర్తి స్థాయిలో సిట్ అధికారులు వివరాలు అడిగినట్లుగా తెలుస్తోంది.
తన దృష్టిలో ఉన్నవన్నీ చెప్పినట్లుగా ప్రచారం
లిక్కర్ స్కామ్ ఇప్పటి వరకూ నారాయణ స్వామిని నిందితుడిగా చేర్చలేదు. ఏ విధంగానూ ఆయనకు డబ్బులు అందాయన్న ఆధారాలు లభించకపోవడంతో ఆయనను సిట్ అధికారులు సాక్షిగానే పరిగణిస్తున్నారు. అరెస్టు చేస్తారన్న భయం కారణంగా ఆయన విచారణకు హాజరవడం మానేశారు.అందుకే సిట్ అధికారులు నేరుగా ఇంటికి వచ్చారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ పాలసీ విషయంలో.. మద్యం ఆర్డర్స్ విషయంలో తనకు తెలిసిన విషయాన్నీ పూసగుచ్చినట్లుగా చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. నారాయణ స్వామి స్టేట్ మెంట్ విశ్లేషించి సిట్ తదుపరి చర్యలు తీసుకోనున్నారు.