SIT Investigation On AP Election Violence: ఏపీలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ టీం చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని 13 మంది సభ్యుల బృందం పల్నాడు, అనంతపురం జిల్లాల్లో శనివారం నుంచి దర్యాప్తును విస్తృతం చేసింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించిన బృంద సభ్యులు బాధితులు, పోలీసుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. వీడియో ఫుటేజీ, ఇతర ఆధారాలు పరిశీలిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వరకూ నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగగా.. ఆదివారం గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నేతృత్వంలో అధికారులు ముమ్మర విచారణ చేశారు. అల్లర్లు జరిగిన సమయంలో వీడియోలను పరిశీలించారు. స్థానిక సీఐ నుంచి సిట్ డీఎస్పీ రామ్మూర్తి వివరాలు సేకరించారు.


తాడిపత్రిలో ఘటనలపై విచారణ


తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సిట్ బృందం.. పోలింగ్ రోజున జరిగిన అల్లర్లు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి మధ్య జరిగిన వివాదంపై వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజున ఓంశాంతి నగర్ లో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించి కూడా వివరాలు సేకరించారు. ఇప్పటివరకు తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో భాగంగా 575 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లర్లకు సంబంధించి 120 మందిని అరెస్టు చేసిన పోలీసులు ఉరవకొండ కోర్టులో వారిని హాజరుపర్చారు. అనంతరం కడప జైలుకు 90 మందిని రిమాండ్ కు పంపారు. మరో 30 మందిని జిల్లాలోని వివిధ జైళ్లల్లో రిమాండ్ లో ఉంచినట్లు సమాచారం. అల్లర్లలో పాల్గొన్న మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి తాడిపత్రి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గాలిస్తున్నారు. 


తిరుపతిలోనూ విచారణ


మరోవైపు, తిరుపతిలోని పద్మావతి యూనివర్శిటీని సైతం సిట్ సభ్యులు ఆదివారం పరిశీలించి.. ధ్వంసమైన వాహనాల వివరాలు సేకరించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్ రూం సమీపంలోకి ఆయుధాలు రావడంపై పోలీసులను ప్రశ్నించారు. రామిరెడ్డి, కూచివారిపల్లెలోనూ పర్యటించిన సిట్ బృందం.. రాళ్ల దాడి జరిగిన టీడీపీ, వైసీపీకి సంబంధించిన నేతల ఇళ్లను పరిశీలించి వివరాలు సేకరించింది. అటు, నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారులను మంత్రి అంబటి కలిశారు. సత్తెనపల్లిలో జరిగిన అల్లర్లపై విచారణ చేయాలని కోరారు. 


త్వరలోనే నివేదిక


హింసాత్మక ఘటనలపై విచారణ వేగవంతమైన వేళ పూర్తి నివేదికను సిట్ త్వరలోనే ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి వరకూ పూర్తి వివరాలను తెలియజేయనున్నట్లు సమాచారం.


Also Read: VV Lakshmi Narayana: రాష్ట్రంలో అల్లర్ల టైంలో జగన్ లండన్ పర్యటనా? లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు