Sharmila made key comments on Vijayasai Reddy resignation: జగన్ కోసం విజయసాయిరెడ్డి చేయని పనులే లేవని అలాంటి వ్యక్తి కూడా జగన్ ను వదిలేసి వెళ్లిపోయారంటే వైసీపీలో ఏం జరుగుతుందో ఆలోచించాలని ఆ పార్టీ కార్యకర్తలకు షర్మిల పిలుపునిచ్చారు. జగన్ మోహన్ రెడ్డి నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయారని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి అంశంపై విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
జగన్ మోహన్‌రెడ్డికు ఏం చెప్పకుండా విజయసాయి రెడ్డి రాజీనామా చేయరనన్నారు. జగన్ చెప్పాడని తన కుటుంబం, తన పిల్లల మీద ఇష్టం వచ్చినట్లుగా విజయసాయిరెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు. వైసీపీని ఆయన వీడారంటే చిన్న విషయం కాదన్నారు. జగన్‌ను వీసారెడ్డి వంటి వారే వదిలి వేస్తున్నారంటే ఆలోచన చేయాలని అన్నారు. ఒక్కొక్కరుగా జగన్‌ను వదిలి బయటకు వస్తున్నారన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయినందున తన అనుకున్నవారంతా వైసీపీ నుంచి వెళ్లిపోతున్నారని అన్నారు. బీజేపీకి, మోదీకి జగన్ దత్త పుత్రుడు అని విమర్శించారు. ఇంతకాలం వీసారెడ్డిని బీజేపీ దగ్గర ఉంచే కేసుల విచారణ సాగకుండా జగన్ చేశారని ఆరోపించారు.
ఇప్పుడు విశ్వాసనీయతను జగన్ కోల్పోయారని విమర్శలు చేశారు. విజయసాయి రెడ్డి గతంలో ఎన్నో అబద్దాలు చెప్పారన్నారు. ఇప్పడైనా అన్ని నిజాలు ఆయన బయట పెట్టాలని చెప్పారు. మాజీ మంత్రి వివేకా కేసులో కూడా జగన్ చెప్పమన్న విధంగా అబద్దాలు చెప్పారన్నారు. వీసా రెడ్డి అన్నీ నిజాలు చెబితే.. ప్రజలు ఇప్పుడైనా హర్షిస్తారని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
ఆస్తుల వివాదంలో జగన్ షర్మిలతో పాటు విజయమ్మపైఎన్సీఎల్టీలో కేసు వేసినప్పుడు పెద్ద దుమారం రేగింది. ఆ సమయంలో షర్మిల ఓ లేఖ విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలోనే ఆస్తుల గురించి క్లారిటీ ఇచ్చారని.. అప్పుడు విజయసాయిరెడ్డి కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. తర్వాత విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి.. షర్మిల చెప్పినవన్నీ అబద్దాలని చెప్పారు. షర్మిలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ విషయాలను షర్మిల ప్రస్తావించారు. ఇప్పుడు అయినా నిజాలు చెప్పాలని ఆమె కోరుతున్నారు.
షర్మిల వివేకా విషయంలోనూ నిజాలు చెప్పారని కోరుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు వైసీపీ తరపున విజయసాయిరెడ్డి ముందుగా గుండెపోటుతో చనిపోయారని ప్రకటించారు. తర్వాత అది దారుణ హత్యగా తేలింది. దారుణహత్యగా తేలిన తర్వాత టీడీపీ నేతలపై ఆరోపణలు ప్రారంభించారు. ఎందుకు ఆయన గుండెపోటుతో ముందుగా చనిపోయారని ప్రకటించారన్నదానిపై అనేక సందేహాలు వచ్చాయి. ఆయనకు హత్య వెనుకా, ముందు ఏం జరిగిందన్నది ఆయనకు తెలుసని అందుకే నిజాలు చెప్పాలని షర్మిల కోరుతున్నారని అంటున్నారు.
విజయసాయిరెడ్డి రాజీనామా అంశం.. వైఎస్ఆర్‌సీపీలో సంచలనంగా మారుతోంది. త్వరలో మరికొంత మంది రాజీనామాలు చేసి వెళ్తారన్నప్రచారంతో ఆ పార్టీ నేతలు గందరగోళానికి గురవుతున్నారు.
Also Read: ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా?