YSRCP  join hands with BJP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీతో కలుస్తామని ప్రకటనలు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి .. అవకాశం వస్తే బీజేపీతో కలిసి నడుస్తామని ప్రకటించారు. గత ఎన్నికల్లో బీజేపీతో కలవకుండా తప్పు చేశామని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల పాటు బీజేపీకి అన్ని విధాలుగా మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. చంద్రబాబుపై మోదీ, అమిత్ షాలకు నమ్మకం లేదని నల్లపురెడ్డి చెప్పుకొచ్చారు.  

Continues below advertisement






భారతీయ జనతా పార్టీ ఇప్పుడు టీడీపీ, జనసేనతో కలిసి ఉంది. ఎన్డీఏలో టీడీపీ, జనసేన నమ్మకమైన మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయినా ఇప్పుడు బీజేపీతో కలిసి నడుస్తామని నల్లపురెడ్డి ఎందుకు చెబుతున్నారన్న ది ఆసక్తికరంగా మారింది. నెల్లూరు జిల్లాలో బీజేపీకి ఎలాంటి బలం లేదు. కోవూరు నియోజకవర్గంలోనూ లేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీతో కలిసి నడుస్తామని చెప్పేందుకు ఆయనకు ఏమైనా సూచనలు వచ్చాయా అన్న అంశంపై రాజకీయవర్గాలు చర్చిస్తున్నాయి. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇటీవలి కాలంలో మీడియాతో మాట్లాడలేదు. హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టి బీజేపీతో కలిసి వెళ్తామని అంటున్నారు. 


వైసీపీ నేతలపై  కేసుల వల పడుతోంది. వరుసగా కేసులు నమోదవుతున్నాయి. గాలి జనార్ధన్ రెడ్డి జైలుకెళ్లాడు. ఏడు ఏళ్లు జైలుశిక్ష పడింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణతో పాటు కొత్త గా లిక్కర్ కేసులు కూడా వెంట పడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీకి మద్దతుగానే ఉంటామన్న సంకేతాలను పంపిస్తే బెటరని అనుకుంటున్నారని అందుకే నల్లపురెడ్డితో ఈ ప్రకటన చేయించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. సాధారణంగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాష్ట్ర స్థాయి పార్టీ పాలసీల మీద ఎప్పుడూ మాట్లాడరు. 


అయితే నల్లపురెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకే ఇలా మాట్లాడారని అంటున్నారు.  వైసీపీ.. బీజేపీతో కలవడం అనేది దాదాపుగా జరగని పని. వైసీపీ ఓటు బ్యాంక్ అయిన ముస్లిం, క్రిస్టియన్లు.. బీజేపీతో కలిస్తే ఆ పార్టీకి దూరమవుతారు. దాని వల్ల ఇంకా ఓటు బ్యాంక్ నష్టం జరుగుతుంది. అందుకే బీజేపీకి ఎలాంటి మద్దతు అయినా ఇస్తాం కానీ నేరుగా పొత్తులు పెట్టుకోబోమని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. గతంలోనే వారికి కేబినెట్లో చేరే అవకాశం వచ్చినా వద్దనుకున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో పార్టీ నేతలు క్రమంగా బీజేపీ పాట అందుకుంటున్నారు. 


నల్లపురెడ్డి ప్రకటనలపై వైసీపీ స్పందించి.. ఆయన వ్యక్తిగత అభిప్రాయమని.. పార్టీకి సంబంధం లేదని అంటే.. కాస్త క్లారిటీ వస్తుంది. సైలెంట్ గా ఉంటే మాత్రం.. పార్టీ పెద్దల వైపు నుంచి వచ్చిన  సంకేతాల మేరకే నల్లపురెడ్డి మాట్లాడారని అనుకోవచ్చు.