Chandrababu Sankranti:  ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడానికి సోమవారం సాయంత్రం గ్రామానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రాకతో ఊరంతా పండుగ కళ సంతరించుకుంది. నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఒకేచోట చేరడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

Continues below advertisement

ఈ వేడుకల్లో భాగంగా గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో స్థానిక మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఈ ముగ్గుల పోటీలను స్వయంగా పరిశీలించి మహిళలను ఉత్సాహపరిచారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చంద్రబాబు గ్రామస్తులతో సరదాగా ముచ్చటించారు. ఆయన మనవడు దేవాన్ష్ కూడా స్థానిక పిల్లలతో కలిసి ఆటపాటల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.      

Continues below advertisement

తన తండ్రి లోకేష్‌తో కలిసి గ్రామానికి చేరుకున్న దేవాన్ష్, తన వయసు పిల్లలతో కలిసి చాలా ఉత్సాహంగా గడిపారు. ముఖ్యంగా స్థానిక జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన ఆటల పోటీల్లో ఆయన పాల్గొని సందడి చేశారు. పల్లెటూరి వాతావరణంలో సాధారణ బాలుడిలా కలిసిపోయి, పిల్లలతో సరదాగా ముచ్చటిస్తూ పండుగ సంబరాలను ఆస్వాదించారు. దేవాన్ష్ తన నానమ్మ భువనేశ్వరితో కలిసి ముగ్గుల పోటీలను తిలకిస్తూ, గ్రామస్తుల మధ్యన గడపడం అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది.       

   ముఖ్యమంత్రి పర్యటన కేవలం పండుగ సంబరాలకే పరిమితం కాకుండా  అభివృద్ధి జాతర గా కూడా మారింది. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు సుమారు రూ. 160 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,  ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సీసీ రోడ్లు ,  తాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే మహిళా సాధికారతలో భాగంగా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలను కూడా పంపిణీ చేయనున్నారు.   

పండుగ ముగింపు రోజైన జనవరి 15న నారావారిపల్లెలోని గ్రామ దేవత నాగాలమ్మ ఆలయంలో నారా - నందమూరి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే చంద్రబాబు తన తల్లిదండ్రుల స్మృతి వనానికి వెళ్లి నివాళులర్పించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పండుగ సెలవుల అనంతరం 15వ తేదీ సాయంత్రం ఆయన తిరిగి అమరావతికి పయనం కానున్నారు.