Jagan was not against Amaravati : అమరావతిని జగన్ వ్యతిరేకించలేదని వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. జగన్ ఇల్లు అమరావతిలోనే ఉందన్నారు. పెద్దపెద్ద భవనాలను కడుతూ ప్రజాధనం వృధా చేస్తున్నారనే జగన్ ప్రశ్నించారన్నారు. అమరావతి అనేది కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని, అక్కడ చంద్రబాబు నాయుడు తన అనుకూల వర్గాలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదన్నారు. జగన్ ఎప్పుడూ రాష్ట్రానికి ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు.
రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతినే ప్రశ్నించారు !
రాజధాని పేరుతో అక్కడ పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగాయని, అవినీతి చోటు చేసుకున్నప్పుడు దానిని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అమరావతిని అభివృద్ధి చేస్తామంటున్న కూటమి ప్రభుత్వం, కేవలం గ్రాఫిక్స్‌తోనే కాలక్షేపం చేస్తోందని సజ్జల విమర్శించారు. చంద్రబాబు గతంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి చేసిన వాగ్దానాలు ఏవీ నెరవేరలేదని, ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పారదర్శకత లేకుండా అక్కడ సాగుతున్న పనులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, కేవలం భ్రమలు కల్పించడం ద్వారా ప్రజలను మోసం చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతిలో సాగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు చిత్రీకరించడం సరికాదని, బాధ్యత గల ప్రతిపక్షంగా తాము ప్రజా ప్రయోజనాల కోసం నిలబడతామని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి గురించి జగన్ ఏమన్నారంటే?
అమరావతి రాజధానిని వరద ముప్పు ఉన్న ప్రాంతంలో నిర్మిస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విమర్శించారు. కృష్ణా నది గర్భానికి అత్యంత సమీపంలో, లోతట్టు ప్రాంతాల్లో భవనాల నిర్మాణం చేపట్టడం వల్ల భవిష్యత్తులో భారీ వరదలు వస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతంలో నిర్మించిన నివాసాల గురించి ప్రస్తావిస్తూ రాజధాని ప్రాంతంలో ఐదు అడుగుల మేర మట్టిని నింపి భారీ భవనాలు నిర్మించాల్సి రావడం వల్ల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరుగుతుందని, ఇది ప్రజా ధనాన్ని వృధా చేయడమేనని జగన్ పేర్కొన్నారు. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు గా చంద్రబాబు అభివర్ణించినా, వాస్తవానికి అది ఒక అసాధ్యమైన మోడల్ అని ఆయన విమర్శించారు. కేవలం రియల్ ఎస్టేట్ లబ్ధి కోసమే నదీ గర్భం పక్కన ఉన్న భూములను ఎంచుకున్నారని, భవిష్యత్ తరాల భద్రతను విస్మరించారని ఆయన తన వ్యాఖ్యల్లో స్పష్టం చేశారు.
వైసీపీ విధానంపై గందరగోళం
అమరావతి విషయంలోవైసీపీ విధానంపై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోంది. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. జగన్ అమరావతికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తే సజ్జల అలాంటిదేమీలేదంటారు. మరొకరు మరో విధంగా ప్రకటన చేస్తారు. ఈ గందరగోళంపై వైసీపీ క్లారిటీ ఇవ్వకపోతే గందరగోళం అలాగే కొనసాగే అవకాశం ఉంది.