Sajjala on CBN Arrest: టీడీపీ అధినేత చంద్రబాబుపై అమరావతి రింగ్ రోడ్డు, అసైన్డ్ ల్యాండ్, ఫైబర్ నెట్ కేసులు  రాత్రికి రాత్రే పుట్టుకు వచ్చినవి కావని ఏపీ  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి తెలిపారు. వైసీపీ ప్రతిపక్షంగా  ఉన్నప్పుడే వీటి గురించి చెప్పిందని.. రెండేళ్లుగా ఈ కేసులపై విచారణ జరుగుతోందన్నారు. అలాగే బలమైన  ఆధారాలు ఉన్నప్పుడు పిలిచి  మాట్లాడతారని చెప్పుకొచ్చారు. గతంలో జగన్ పై అక్రమ కేసులు పెట్టారని, కక్ష సాధింపు  చర్యలు చేపట్టారని ఫైర్ అయ్యారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కలపడం చంద్రబాబుకు మంచిదనని సజ్జల చెప్పుకొచ్చారు. అరెస్ట్ చేయకపోతే నీతి పరుడిని అంటారని, అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అంటున్నారని వివరించారు. 


నిన్న కూడా చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల, ఏమన్నారంటే?


చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ పేరిట భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రెండు వారాల రిమాండ్ విధించిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా, విచారణ చేస్తుండగా చంద్రబాబు ప్రధాన పాత్రధారి అని బలమైన సాక్ష్యాలు లభించాయన్నారు. ఈ క్రమంలోనే సాక్ష్యాధారాలతో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారని తెలిపారు. స్కిల్ స్కామ్ లో ఆయన తప్పు చేసినట్లు తేలుతుందని, చంద్రబాబుకు కచ్చితంగా శిక్ష పడుతుందని సజ్జల వ్యాఖ్యానించారు. 


నేరానికి సంబంధించి సాక్ష్యాలు దొరికిన సమయంలో నిందితులు డిఫెన్స్ ధోరణిలో ఉండాలి కానీ, తమకు ఏదో అన్యాయం జరిగింది అన్నట్లు చంద్రబాబు వ్యవహరించారని చెప్పారు. చంద్రబాబు కస్టడీలో ఉంటే, ఆయన కుమారుడు నారా లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా ప్రవర్తించారంటూ మండిపడ్డారు. ఈ కేసు కచ్చితంగా నిరూపితమై చంద్రబాబుకు శిక్ష పడుతుందని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరిపైనా అఘాయిత్యం చేయలేదని, అన్యాయంగా ప్రవర్తించలేదని చట్ట ప్రకారంగానే వెళ్తున్నామన్ని స్పష్టం చేశారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు కేవలం రిమాండ్ విధించిందని, విచారణ పూర్తైతే దోషిగా తేలి శిక్ష అనుభవిస్తారని చెప్పారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేసి, తన హయాంలో కోట్ల రూపాయాలు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై ఇంకా కేసులు వస్తాయని, అవినీతి కేసులలో చంద్రబాబు  దొరకడం ఖాయం అని చట్ట ప్రకారంగా కేసులను ఎదుర్కోవాలన్నారు.


ప్రపంచంలో జరగరాని ఘోరం చంద్రబాబు అరెస్ట్ అన్నట్లు టీడీపీ శ్రేణులు వ్యవహరించాయన్నారు. ప్రపంచంలో ఎంతో మంది నేతలు, ప్రధానులు అరెస్ట్ అయ్యారని.. విచారణ ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు, ఆయన మద్దతుదారులు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టులోనైనా, ఏదైనా పనులలో అవినీతి జరిగితే వేరే విషయం అని, కానీ ఉద్దేశపూర్వకంగా స్కిల్ డెవలప్ మెంట్ అనేది ఏర్పాటు చేసి.. ఆపై డొల్ల కంపెనీలు సృష్టించి ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారని ఆరోపించారు. చంద్రబాబు ఇందుకు సంబంధించి పని పూర్తిచేశాక.. ఓ డిపార్ట్ మెంట్ క్రియేట్ చేసి దాన్ని నేరుగా తన కిందకి తెచ్చుకున్నారని తెలిపారు. 90 శాతం ఓ కంపెనీ పెట్టుబడి పెడితే, ప్రభుత్వం కేవలం 10 శాతం పెట్టుబడి పెట్టడం మంచి విషయం అని అంతా భావిస్తారు.. కానీ భారీ స్థాయిలో కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని వైసీపీ నేత సజ్జల రామ కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.