విశాఖ పర్యాటకంలో అత్యంత కీలకంగా ఉన్న రుషికొండ రిసార్ట్‌ను ప్రభుత్వం కూల్చి వేస్తోంది. దీనికి సంబంధించిన కూల్చివేత పనులు శుక్రవారం ఉదయమే ప్రారంభమయ్యాయి. సాయంత్రానికి రెండు రిసార్టులను కూల్చివేశారు. మిగతా వాటిని కూడా రెండు మూడు రోజుల్లో కూల్చి వేసి అక్కడ అంతా చదును చేయనున్నారు.  విశాఖలో సముద్రాన్ని ఆస్వాదించాలనుకునేవారికి రుషికొండ బీచ్ రిసార్ట్ అద్భుతంగా ఉంటుంది. టూరిజంకు ఏడాదికి రూ. 30 కోట్ల ఆదాయం ఆ రిసార్ట్ ద్వారా వస్తుంది. 


విశాఖ బీచ్ రోడ్‌లో గీతం కాలేజీ వైపు వెళ్తే కొండలపై ఉన్న బీచ్ రిసార్టులు చూడటానికే అద్భుతంగా ఉంటాయి. అక్కడ విడిది చేయాలని.. తెల్లవారుజామునే సముద్రాన్ని ఆస్వాదించాలనుకునే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 14ఏళ్ల క్రితం ప్రభుత్వం వాటిని నిర్మించింది. ప్రతీ ఏడాది వాటికి సౌకర్యాల కోసం నిధులు వెచ్చిస్తూనే ఉంటారు.  గత ఏడాదే రూ.రెండు కోట్లు పెట్టి 22గదుల్లో అదనపు సౌకర్యాలు కల్పించారు.  అలాగే రెస్టారెంట్‌, కాన్ఫరెన్స్‌ హాలును రూ. కోటి పెట్టి సౌకర్యాలు మెరగు పరిచారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం భిన్నంగా ఆలోచిస్తుంది. 


ప్రస్తుతం ఉన్న రిసార్ట్‌ను కూల్చివేసి..అక్కడ మళ్లీ కొత్త రిసార్టులు కట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు వేరే కంపెనీకి పనులు అప్పగించింది. కొత్త ప్రాజెక్టులో మొదటిదశ పనులు రూ.91 కోట్లతో  చేపడుతున్నామని...15 నెలల్లోగా పూర్తవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రుషికొండపైన స్థలాన్ని చదును చేయడానికి రూ. 20 కోట్ల వరకూ ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది. రుషికొండ రిసార్ట్ కూల్చివేత అంశానికి అధికారులు పెద్దగా ప్రచారం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవాదం ఉదయం కూల్చివేతలు ప్రారంభమైన సమయంలో ఎవర్నీ అటు వైపు వెళ్లనీయలేదు. కానీ బీచ్ దగ్గర నుంచి చూస్తే కూల్చివేతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో విషయం బయటకు వచ్చింది. 


విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలించాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వానికి అనేక న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ నిర్మాణాలను వివిధ రకాల పేర్లతో చేపడుతోంది. అందులో భాగంగానే రిషికొండ రిసార్ట్ కూడా ప్రభుత్వ అవసరాల కోసం..  కూల్చేసి కొత్త భవనం నిర్మిస్తున్నారన్న అనుమానాలు కొన్ని రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య మంత్రి నివాసం లేదా రాజ్ భవన్ వంటి వాటి కోసం అక్కడ నిర్మాణం చేయవచ్చని చెబుతున్నారు. ఏదైనా రిషికొండ రిసార్ట్ మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది. కూల్చివేతలు పూర్తయిన తర్వాత కాంట్రాక్ట్ కంపెనీ నిర్మాణాలు ప్రారంభించనుంది. మళ్లీ పదిహేను నెలల తర్వాత అక్కడ నిర్మాణాలకు ఓ రూపం వచ్చే అవకాశం ఉంది.