Rayapati Srinivas Rao: గుంటూరు: రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేయడంతో రాయపాటి సాంబశివరావు (Rayapati Sambasiva Rao) కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. రంగారావు వ్యాఖ్యల్ని రాయపాటి అరుణ ఇదివరకే ఖండించారు. చంద్రబాబు, నారా లోకేష్ లపై రాయపాటి రంగారావు అలా మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు. దాంతో రాయపాటి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ (TDP)లో కొనసాగుతుందా, లేక ఏం నిర్ణయం తీసుకుంటుందోనని సస్పెన్స్ నెలకొంది. దీనిపై రాయపాటి శ్రీనివాస్‌ (Rayapati Srinivas) స్పందించారు. రాయపాటి ఫ్యామిలీ టీడీపీలోనే కొనసాగుతుందని రాయపాటి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. 


గుంటూరులో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాయపాటి శ్రీనివాస్ మాట్లాడారు. రంగారావు చేసిన వ్యాఖ్యలు, నిర్ణయాలు అతడి వ్యక్తిగతం అన్నారు. రంగారావు వ్యవహరించిన తీరు సరికాదని అభిప్రాయపడ్డారు.   ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో రంగారావు ఈ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. మొదట్నుంచీ తాము ఉమ్మడి కుటుంబంగానే ఉన్నాంమని.. కుటుంబ, రాజకీయ పరమైన విషయాలైనా అంతా కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకునే వాళ్లమని చెప్పారు. ఇటీవల తమ కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావడం నిజమన్నారు. కానీ రాయపాటి ఫ్యామిలీ మాత్రం టీడీపీలోనే కొనసాగుతుందని, ఇందులో ఏ సందేహం లేదన్నారు. చంద్రబాబు, లోకేష్ తో తమకు ఏ ఇబ్బంది లేదన్నారు.


రంగారావు వ్యక్తిగత నిర్ణయమన్న రాయపాటి శైలజ 
రాయపాటి సాంబశివరావు తమ్ముడి కుమార్తె రాయపాటి శైలజ. అమరావతి రాజధాని ఉద్యమ సమయంలో న్యాయస్థానం టు దేవస్థానం అంటూ మొదలు పెట్టిన పాదయాత్రతో ఆమె రాష్ట్రవ్యాప్తంగా అందరికీ పరిచయమయ్యారు. పాదయాత్రలో ముందుండి నడిచిన శైలజ మీడియాలో కూడా ప్రముఖంగా కనిపించారు. ఆమె ఇప్పుడు మళ్లీ మీడియా ముందుకొచ్చారు. రాయపాటి ఫ్యామిలీ టీడీపీకి ఎప్పుడూ దూరం కాలేదని అంటున్నారామె. రాయపాటి రంగారావు టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోయినంత మాత్రాన ఆ కుటుంబం అంతా బయటకు వచ్చినట్టు కాదని చెప్పారు. రాయపాటి కుటుంబం టీడీపీతోనే ఉంటుందని, ఫరెవర్ చంద్రబాబుకోసమే పనిచేస్తామని సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు శైలజ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 


వివాదం ఎక్కడ మొదలైందంటే..
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు భావించారు. సత్తెనపల్లి అసెంబ్లీ సీటు తనకు కేటాయిస్తారనుకోగా.. అక్కడి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు చంద్రబాబు ఛాన్స్ ఇస్తున్నారు. తనకు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో రంగారావు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కనీసం తనకు టికెట్ ఇవ్వడం లేదని, కన్నాకు అవకాశం ఇస్తున్నామని మాటమాత్రం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో తన ఆఫీసులో చంద్రబాబు ఫొటోను విసిరికొట్టారు. తన కుటుంబాన్ని టీడీపీ సర్వనాశనం చేసిందని ఆరోపించారు.