గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన త్రికోటేశ్వరస్వామి ఆలయానికి ప్రతిష్టాత్మక ఐఎస్‌వో గుర్తింపు లభించింది.  కోటప్పకొండ క్షేత్రంగా త్రికోటేశ్వర స్వామి ఆలయం ప్రాంతాన్ని భక్తులు పేర్కొంటారు.  కోటప్పకొండలో అందించే ఆధ్యాత్మికసేవలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు అందుతున్నాయని అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐఎస్‌వో గుర్తించింది.  గుర్తింపు పత్రాన్ని సంస్థ ప్రతినిధులు వ్యవస్థాపక ధర్మకర్తకు అందించారు.   ప్రతీ ఏటా శివరాత్రి వేడుక కోటప్పకొండలో ఘనంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల వాసులు ప్రభలు కడతారు.  కోటి ప్రభల కొండకు వస్తే త్రీకోటేశ్వర స్వామి కొండ దిగి వస్తారని నమ్మకం.  శివరాత్రి నాడు కోటప్పకొండ కు  సమీపంలోని అన్ని గ్రామాల వారు ప్రభలు, విద్యత్ ప్రభలు కట్టుకుని  కోటప్పకొండ కు వస్తారు.  ఒక్కొక్క ప్రభ 80 అడుగుల ఎత్తు వరకు కడతారు.


కోటప్పకొండకు చాలా ప్రత్యేకతలుఉన్నాయి. ఈ కొండను ఎటు వైపు చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. అందుకే కొండపై ఉన్న స్వామిని త్రికోటేశ్వరస్వామి అని పిలుస్తారు. ఈ మూడు శిఖరాలు బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి చారిత్ర నేపధ్యం ఉంది.  వెలనాటి చోళ రాజులు ఈ ఆలయాన్ని క్రీ.శ 1700 కాలంలో నిర్మించినట్లుగా చెబుతారు.  శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చారు.  నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు, ఇతరులు దేవాలయాభివృద్ధికి సాయం చేశారు.


కోటప్పకొండకు ఐఎస్‌వో గుర్తింపు ఎంతో అభివృద్ధి సాధించిన తర్వాతనే వచ్చింది. ఒకప్పుడు ఆలయానికి కనీస సౌకర్యాలు ఉండేవి కావు. భక్తులకు కేవలం మెట్ల మార్గం మాత్రమే ఉండేది.  ఆ కారణంగా నడవలేకపోయిన భక్తులు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయేవారు. 1999లో  ఘాట్ రోడ్డు నిర్మించారు.  ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. రోడ్డు ఇరువైపులా ఎంతో అందమైన పూలతోటలు ఉంటాయి.  జింకల పార్కు, పిల్లల కోసం పార్కు, ఒక సరస్సును కూడా నిర్మించారు.


 తర్వాత ప్రజాప్రతినిధులు ఆలయం అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిచారు.   ఘాట్ రోడ్ నిర్మించారు. భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించారు. ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేశారు.  కొండపైన సాంస్కృతిక,ఆధ్యాత్మికతను పెంపోందించేలా అనేక నిర్మాణాలు చేశారు.  ఇటీవలి కాలంలో హిల్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించారు.  అలాగే కొండపైకి వెళ్లేందుకు ప్రత్యేకంగా రోప్ వే నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే శంకుస్థాపన చేశారు.  కోటప్పకొండకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడం భక్తులను సంతోషానికి గురి చేసింది. త్వరలో స్వామి వారి ప్రసాదాలకూ గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.