Thopudurthi Prakash Reddy vs Paritala Sunitha: దొంగలే దొంగ దొంగ అంటున్నారని, రిగ్గింగ్ చేసి గెలిచిన చరిత్ర పరిటాల కుటుంబానిది అంటూ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (Thopudurthi Prakash Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉండి ఆ మాటలు మాట్లాడేందుకు సిగ్గుండాలంటూ ప్రకాష్ రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) సైతం అదే స్థాయిలో మండిపడ్డారు.


2009 ఎన్నికల్లో పరిటాల సునీత కర్ణాటక నుంచి మనుషుల్ని రప్పించి 2000 దొంగ ఓట్లు వేస్తే 1700 మెజార్టీతో గెలిచారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ‘2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి హైదరాబాదులో తలదాచుకున్నారు. మాకు రాప్తాడు వద్దు ధర్మవరం కావాలి పెనుగొండ కావాలి అంటూ ఒత్తిడి తెచ్చి ఆఖరికి రాప్తాల్లోనే సీటు గెలిచేందుకు తిరుగుతూ ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో 27 వేల ఓట్లను తొలగించేందుకు ఓటర్లే అడుగుతున్నట్లు పరిటాల సునీత అప్లికేషన్లు క్రియేట్ చేశారు. ఓటర్లు ఎవరూ కూడా తమ సొంత ఊర్లోని ఓట్లను తొలగించండి అంటూ అభ్యర్థిస్తారా అని’ ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. రాప్తాడు ఓటర్లారా మీ ఓటు ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోవాలని ఓటర్లకు ప్రకాష్ రెడ్డి సలహా ఇచ్చారు. నియోజకవర్గంలో సుమారుగా 50వేల ఓట్లు తొలగించేందుకు పరిటాల సునీత కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బిఎల్ఓ ల మీద ఒత్తిడి తెచ్చి ఓటరు తొలగించే విషయంలో ఎలక్షన్ కమిషనర్ కు పంపించేందుకు సిద్ధమయ్యారని సంచలనానికి తెరతీశారు.


అధికారంలో ఉండి ఆ మాటలు మాట్లాడేందుకు సిగ్గుండాలి: పరిటాల సునీత 
ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత నిప్పులు చెరిగారు. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు.. అతని పార్టీ అధికారంలోకి ఉంది.. అయినా మేము ఓట్లు తొలగిస్తున్నామని చెప్పేందుకు కాస్తయినా సిగ్గుండాలని పరిటాల సునీత ధ్వజమెత్తారు. పరిటాల సునీత 50వేల ఓట్లు తొలగిస్తున్నారంటూ ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గత ఎన్నికల ముందునుంచి ఇప్పటివరకు వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించి.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాపై నిందలు వేస్తావా అంటూ ప్రకాష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. మీ గ్రామంలో మీ ఇంట్లో ఓట్ల లెక్క తేల్చుదామా అంటూ సవాల్ విసిరారు. మీ ఇంట్లో మీ  అనుచరులు, కుటుంబసభ్యుల పేరు మీద డబుల్ ఓట్లు లేకుంటే మేము దేనికైనా సిద్ధం అని సవాల్ విసిరారు. మీ ఇంటి నుంచే ఓట్ల అక్రమాలకు పాల్పడి.. మేము 50వేల ఓట్లు తొలగిస్తున్నామంటూ ఆరోపణలు చేస్తావా అంటూ విరుచుకుపడ్డారు. మేము ఓట్లు తొలగిస్తుంటే.. నువ్వు నీ సోదరులు, మీ పార్టీ వారు గాడిదలు కాస్తున్నారా అంటూ ప్రశ్నించారు. 
అధికారంలో మీరు ఉండి.. మేము అధికారుల్ని బెదిరింపులకు గురి చేస్తున్నామని ఆరోపించడానికి కాస్తైనా బుర్ర ఉందా అంటూ పరిటాల సునీత నిలదీశారు. రాప్తాడులో ఒక డిప్యూటీ తహసీల్దార్ ద్వారా ఎన్ని బోగస్ ఓట్లు ఎక్కించావో ఆధారాలతో సహా ఇచ్చామన్నారు. బీఎల్ఓ స్థాయి సిబ్బందిని కూడా నువ్వు ఫోన్ చేసి బెదిరిస్తున్నావంటే నీకు ఎంత ఓటమి భయం పట్టుకుందో అర్థమవుతోందన్నారు. 2019 ఎన్నికల్లో అక్రమంగా ఓట్లు ఎక్కించి ప్రకాష్ రెడ్డి గెలిచిన విషయం అందరికీ తెలుసన్నారు. అప్పటి డిప్యూటీ తహసిల్దార్ లక్ష్మీనరసింహం ద్వారా వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఎక్కించి గెలిచిన తర్వాత ఆయనకు బహిరంగంగా కృతజ్ఞతలు చెప్పిన విషయం నిజం కాదా అన్నారు. నా గెలుపులో నీ సహకారం ఉంది అంటూ చెప్పలేదంటావా అని ప్రశ్నించారు. 


ఎన్నికల్లో ఓడిపోతే ఊర్లు విడిచి హైదారాబాద్ పోయేది ఎవరో నియోజకవర్గంలో అందరికీ తెలుసున్నారు. 2019 ఎన్నికల్లో మేము ఓడిపోయినా ఇక్కడే ఉన్నాం. మా సోషల్ మీడియా చెక్ చేస్తే ఎవరు ప్రజల్లో ఉన్నారో తెలుస్తుందన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్న నువ్వు.. ప్రజల సంగతి పక్కనపెడితే మీ పార్టీ వారు కూడా నిన్ను కలవలేకపోతున్నారని ప్రకాష్ రెడ్డిని విమర్శించారు. నీ గెలుపు కోసం కష్టపడిన వారు మీ ఇంటికి వస్తే వారి మోహం కూడా చూడకుండా వెళ్లిపోయేది నువ్వు కాదా అని ప్రశ్నించారు. మీ సోదరులైతే సొంత పార్టీ వారిని చెప్పలేని భాషలో తిడుతూ వెనక్కు పంపిన రోజుల్ని వారు మర్చిపోలేదన్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలు మేము చేయాలనుకుంటే.. 2019 ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి అడ్రస్ కూడా ఉండేది కాదన్నారు. 2024 ఎన్నికల తర్వాత మళ్లీ హైదరాబాద్ బాట పట్టక తప్పదని.. ఇక మీ సోదరులు ఇప్పటికే తట్టబుట్ట మెల్లగా సర్దుతున్నారని సునీత సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజలతో ఉన్నది ప్రజల పక్షాన నిలబడేది పరిటాల కుటుంబమని ఆమె స్పష్టం చేశారు.