Rajinikanth :  చంద్రబాబు విజన్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు   గెలిస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ అవుతుందన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభకు ముఖ్య అతిథిగా రజనీకాంత్  హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో అనుబంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనకు 30 ఏళ్లుగా స్నేహితుడన్నారు. ఆయన హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. 


ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును దీవిస్తుంది : రజనీకాంత్                             


 ఐటీ గురించి ఎవరూ ఆలోచించని రోజుల్లోనే ఐటీని ప్రోత్సహించారన్నారు. ఇటవల తాను హైదరాబాద్  వెళ్లానని..  న్యూయార్క్ లో ఉన్నానా.. హైదరాబాద్‌లో ఉన్నానా అన్న అనుమానం వచ్చిందన్నారు. సైబరాాబద్‌ను చంద్రబాబు అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ఈ సభను చూస్తూంటే రాజకీయం మాట్లాడాలని అనిపిస్తోంది కానీ.. వద్దని తన అనుభవం చెబుతోందని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును దీవిస్తుందన్నరు. చంద్రబాబు విజన్ గురించి దేశంలో ఉన్న పెద్ద నాయకులందరికీ తెలుసన్నారు. బాలకృష్ణ తన మిత్రుడు, కంటిచూపుతోనే చంపేస్తాడు.. బాలకృష్ణ చేసే ఫీట్లు అమీర్‌ఖాన్‌, సల్మాన్‌, అమితాబ్‌, నేను చేసినా జనం ఒప్పుకోరని రజనీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇప్పుడు 2047 విజన్  ప్లాన్ చేసుకున్నారని ఆయన ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటున్నానన్నారు. 


ఎన్టీఆర్ ఎంతో ప్రభావితం చేశారు : రజనీకాంత్                          


ఎన్టీఆర్‌ తనను ఎంతో  ప్రభావితం చేశారన్నారు. తాను  నేను చూసిన మొదటి సినిమా పాతాళభైరవి అని అప్పుడు తన వయసు ఆరేళ్లు ఉంటుందన్నారు.   నేను హీరోగా చేసిన తొలి సినిమా పేరు భైరవి అన్నారు.  13 ఏళ్లప్పుడు లవకుశ సినిమా సమయంలో ఎన్టీఆర్‌ను చూశానని వ్యాఖ్యానించారు.  ఓసారి ఎన్టీఆర్‌ వచ్చినప్పుడు చూడడానికి వెళ్తే ఎవరో నన్ను ఎత్తుకుని ఆయన్ని చూపించారు.. 18 ఏళ్లప్పుడు స్టేజ్‌పై ఎన్టీఆర్‌ను ఇమిటేట్‌ చేశా.. ఆ తర్వాత 1977లో ఆ మహానుభావుడితోనే కలిసి టైగర్‌ సినిమా చేశాననని గుర్తు చేసుకున్నారు.  దానవీర శూరకర్ణ ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు.. ఎన్టీఆర్‌ది ఎంతో గొప్ప వ్యక్తిత్వం.. అప్పట్లో దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ సంచలనం సృష్టించారు.. మహామహులను ధీటుగా ఎదుర్కొన్నారన్నారు. 


రజనీకాంత్ మహోన్నత వ్యక్తి : చంద్రబాబు                                                             


రజనీకాంత్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చారని చంద్రబాబు అన్నారు. రజనీకాంత్‌కు విదేశాల్లోనూ వీరాభిమానులు ఉన్నారన్నారు. ఉన్నతమైన వ్యక్తులు ఎలా ప్రభావితం చేస్తారో రజనీకాంత్ చెప్పారన్నారు. అందరూ రజనీకాంత్ ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.