కాకినాడలోజనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని అన్నారు. దమ్ముంటే పవన్ కాకినాడ నగరం నుంచి పోటీ చేసి తనపై గెలవాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచినట్టు, 175 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను గెలిపించుకున్నట్టు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినట్టు సినిమాలు తీసుకుంటే బాగుంటుందన్నారు. అంతే కానీ నిజ జీవితంలో పవన్ గెలవలేరన్నారు. 


మార్చి 14న ముఖ్యమంత్రిగా సరిపోను అన్నా పవన్ కల్యాణ్ మళ్లా మాట ఎందుకు మార్చారని ప్రశ్నించారు ద్వారంపూడి. సింగిల్‌గా పోటీ చేస్తే సీట్లు రావు అంటూ చంద్రబాబుకు మద్దతు తెలిపి మూడు నెలలు కాకముందే యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ మధ్యలోనే మూడు సార్లు చంద్రబాబును కలిశారని విమర్శించారు. సీట్లు కుదర్లేదని... ప్యాకేజీ బేరం సరిపోలేదని ఆరోపించారు. అందుకే ఇప్పుడు తనకు సీఎం పదవి కట్టబెట్టాలని అడుక్కుంటున్నారని సెటైర్లు వేసారు. 


కర్ణాటకలో కుమారస్వామిలా 30,40 సీట్లు తీసుకొని దొడ్డిదారిన సీఎం అవుదామని గోతికాడ నక్కలా చూస్తున్నావని ఘాటుగా విమర్శించారు ద్వారంపూడి. తమ ప్రభుత్వంలో లోపాలు ఉంటే విమర్సించవచ్చు కానీ.. ప్యాకేజీ అనుకూలంగా ఉన్నప్పుడు ఓ మాట.. లేనప్పుడు మరో మాట మాట్లాడటం సరిగాదన్నారు. అందుకే పవన్ రాజకీయంగా జీరో అని విమర్శించారు. 


ప్రశాంతంగా ఉన్న కాకినాడ నగరంలో తన ఫ్యామిలీ దౌర్జన్యాలు చేస్తోందన్న విమర్శపై కూడా ద్వారంపూడీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తాను కబ్జాకోరు, రౌడీని అయితే మూడుసార్లు పోటీ చేస్తే ప్రజలు రెండుసార్లు ఎందుకు గెలిపించారని ప్రశ్నించారు. తన సామాజిక వర్గం తక్కువగా ఉన్నప్పటికీ అన్ని సామాజిక వర్గాలు తనను గెలిపించారన్నారు. ఈ విషయంలో తాను హీరోనని అన్నారు. అలా పవన్ కల్యాణ్‌ విజయం సాధించగలరా అని సవాల్ చేశారు. తనలా గెలవడం పవన్‌కు సాధ్యంకాదన్నారు. పరిటాల రవి లాంటి వాళ్లు గుండు కొట్టించారని.. తుపాకులతో నడిరోడ్డుపై తిరిగింది పవనే అన్నారు. తాము ఎప్పుడూ గన్స్ పెట్టుకొని తిరగలేదన్నారు. 


హీరోవి కావబట్టి 175 స్థానాల్లో గెలిచినట్టు, సీఎం అయినట్టు సినిమాలు తీసుకోవాలని సూచించారు ద్వారంపూడి. కానీ ప్రాక్టికల్‌గా సాధ్యం కాదన్నారు. ఎక్కడ నిలబడినా అవమానం తప్పదని హెచ్చరించారు. ప్రజల్లోకి వచ్చి ఎమ్మెల్యే అవుదామని.. సీఎం అవుదామంటే పవన్ వల్ల కాదన్నారు. 


భూకబ్జాలు, దొంగనోట్లు ముద్రించామని నిరూపించాలని సవాల్ చేశారు ద్వారంపూడి. తాగి తాను ఎప్పుడూ జనసేన నాయకులను తిట్టలేదన్నారు. అసలు తాగే అలవాటు తనకు లేదన్నారు. ఎవడో కోతి చెబితే కోతి గెంతులేయవద్దన్నారు. ఒకటి రెండుసార్లు పరిశీలించి విమర్శలు చేస్తే మంచిదన్నారు. రైస్ వ్యాపారమే కాకినాడలో 15వేల కోట్లు లేదన్నారు. పవన్ కు ఉన్న అవగాహన ఏంటీ అని ప్రశ్నించారు. జగన్‌ సీఎం అయ్యాక ఎగుమతి స్థాయి పెరిగిందన్నారు. ఇక్కడ ఖర్చు తక్కువ కాబట్టి కాకినాడ నుంచి ఇతర్రాష్ట్రాల నుంచి బియ్యం ఎక్స్‌పోర్ట్ అవుతుందన్నారు. తన వద్ద 15వేల కోట్లు ఉంటే చంద్రబాబు కంటే ముందే పవన్‌ను కొనేసేవాడినన్నారు. 


పవన్ కల్యాణ్‌తోపాటు చంద్రబాబుపై కూడా ద్వారంపూడి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని అన్నారు. ఆయనకు సపోర్ట్ చేసేవారిని జగన్ ఆర్థికంగా దెబ్బ తీశారని కామెంట్ చేశారు. వాళ్లెవరూ కోలుకోరని... టీడీపీకి సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉండబోదన్నారు. పవన్ కల్యాణ్‌కు కూడా ప్యాకేజీ ఉండదని విమర్శించారు.