ఎన్నికల బరిలో ఉండాలా వద్దా అనుకునే సమయంలో జనసైనికులతో తిట్టింది తనలో ఉత్సాహం కలిగించిన పవన్‌కు ముద్రగడ ధన్యవాదాలు తెలిపారు. యుద్ధానికి రెడీ అవ్వాలన్న వాతావరణం కల్పించనందుకు సంతోంగా ఉందన్నారు. పవన్‌కు రెండో లేఖలో కీలక అంశాలపై స్పష్టత ఇచ్చారు. 


కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్ చేసినట్టు పోటీకి సిద్ధం కావాలని పవన్‌కు ముద్రగడ సూచించారు. ఏ కారణంతోనైనా అక్కడ చేయబోనని తోక ముడిస్తే పిఠాపురం నుంచి పోటీకి సిద్దపడాలన్నారు. అలా సిద్దపడిన తర్వాత తనకు సవాల్ చేస్తే తాను రెడీ అవుతారని చెప్పుకొచ్చారు ముద్రగడ. 


చేగువేరా ఆదర్శం అంటూ చెప్పుకునే పవన్ కల్యాణ్... గుండెల నిండా దైర్యం ఉంటే రెండింటిలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. జనసైనికులు బూతులు తిడుతూ మెసేజ్‌లు పెట్టినంత మాత్రాన తాను భయపడి పోయి లొంగిపోయే ప్రసక్తి లేదన్నారు. డోంట్ కేర్ అంటూ... ఎప్పటికీ మీ మోచేతి కింద నీళ్ళు తాగడం లేదని తాగబోనని చెప్పారు. 


సినిమా హీరోవే- రాజకీయాల్లో కాదు


ఎప్పుడూ తాను పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్స్ ఇవ్వలేదని అయినా తనను కాకినాడ ఎమ్మెల్యేలను తిట్టిపోశారని విమర్శించారు ముద్రగడ. అలా ఫ్యాన్స్‌తో తిట్టించడం వల్ల మీరు పెద్ద హీరో అనుకుంటున్నరాని... సినిమాల్లోనే హీరో తప్ప రాజకీయాల్లో కాదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. 


అసలు తనను పవన్ గానీ, వారి అభిమానులు కానీ తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు ముద్రగడ.  డబ్బు ఉందని అభిమానులతో తిట్టించారా అని నిలదీశారు. తాను ఓ అనాథ అని ఏమన్నా పడతామనే గర్వమా అని అడిగారు. వంగవీటి రంగా హత్య తర్వాత చాలా మందిని జైల్లో పెట్టారని వాళ్లను ఎప్పుడైనా పవన్ పరామర్శించారా అని క్వశ్చన్ చేశారు. వారికి బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేశారని అని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న 2016లో జరిగిన తుని సభ తర్వాత పెట్టిన కేసులపై ఎందుకు మాట్లాడలేదన్నారు. ఈ సంఘటనల్లో ఎవరి పాత్ర ఏంటీ అందరికీ తెలుసు అన్నారు ముద్రగడ. 


ప్రసంగాలు సినిమా డైలాగ్స్‌ను మరిపించాయి


కులం కోసం తాను ఏమీ చేయనట్టు కులాన్ని ఉపయోగించుకొని ఎదిగినట్టు ఉద్యమాన్ని అమ్మేసినట్టు  దుష్ప్రచారం చేస్తున్నారని ఇవి సినిమా డైలాగ్‌లను మరిపించిందన్నారు. గోచీ, మొలతాడు లేని వారితో తిట్టించడం మగతనం కాదన్నారు. దమ్ముధైర్యం ఉంటే నేరుగా తన పేరును ఉపయోగించి మీరే తిట్టాలని పవన్‌కు సవాల్ చేశారు. దానికి తాను సమాధానం చెబుతానన్నారు. కాపుల గురించి ఎప్పుడూ ఆలోచన చేయని పవన్‌ కాపుల గురించి మాట్లాడే హక్కులేదని విమర్శించారు. 


ద్వారంపూడితో బంధం ఈనాటిది కాదు


ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఫ్యామిలీతో తనకు ఉన్న అనుసంబంధం ఇప్పటిది కాదన్నారు ముద్రగడ. పవన్ కల్యాణ్ కోసం ఆ బంధాన్ని వదులుకోలేనన్నారు. దీనిపై అభిమానులతో తిట్టించినా డోంట్ కేర్ అన్నారు. నేనేమీ పవన్ కల్యాణ్ బానిస కాదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల ముందు తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్  తనను కలిశారని.. పవన్ గురించి చాలా సమయం మాట్లాడారన్నారు. అలాంటి వారిని కూడా ఓడించాలని పవన్ ప్రచారం చేశారని మండిపడ్డారు. తాను పవన్ యాత్రకు వెళ్లి ఆయన కాళ్లు మొక్కకపోవడం వల్లే తిడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటికి భయపడి తాను లొంగిపోబోనని పోరాడుతూనే ఉంటానన్నారు.