Rajahmundry and Tirupati to Mumbai Flight Service: నేటి నుంచి తిరుపతి, రాజమండ్రి నుంచి రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ముంబై వెళ్లే వాళ్ల కోసం ఈ సర్వీస్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగుతుండడంతో దానికి అనుగుణంగా విమానయాన సంస్థలు కూడా సర్వీసులు పెంచేందుకు ముందుకు వస్తున్నాయి. దీనికి తోడు ఎన్డీఏలో ప్రభుత్వ చొరవతో విమానయాన సంస్థలు వరస కడుతున్నాయి.
విమాన సర్వీస్‌లు పెరగడానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ, కృషి కూడా కారణంగా నిలుస్తోంది. రాజమండ్రి, తిరుపతికి కొత్త విమానాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ మేరకు రాజమండ్రి - ముంబై - రాజమండ్రి(6ఈ 582/3), తిరుపతి - ముంబై - తిరుపతి(6ఈ 532/3) మధ్య డిసెంబర్ 2 నుంచి కొత్తగా విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకు వచ్చింది.
విమానయాన సంస్థలు ఆసక్తి..
రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన విమాన ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా కొత్త సర్వీసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ, విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైకి కొత్త సర్వీసులు ప్రారంభమయ్యాయి. తాజాగా రాష్ట్రానికి మరో రెండు కొత్త సర్వీసులు మంజూరయ్యాయి. రాజమండ్రి - ముంబై - రాజమండ్రి(6ఈ 582/3), తిరుపతి - ముంబై - తిరుపతి(6ఈ 532/3) మధ్య డిసెంబర్ 2 నుంచి కొత్తగా విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకు వచ్చింది. దీని కోసం యుద్ధప్రాతిపదికన ప్రక్రియ పూర్తి చేయడంతో అనుకున్న దాని కంటే వేంగా సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
రాబోయే రోజుల్లో మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని విమానయాన సంస్థలు ఇక్కడి నుంచి విమానాలు నడిపేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇక్కడ నుంచి విదేశాల్లో స్థిరపడే వారి సంఖ్య పెరుగుతుండటంతో రాకపోకలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతే కాకుండా ఇక్కడ రాజకీయ, వ్యాపార కార్యక్రమాలు పెరగడం కూడా దీనికి ఓ కారణం.
ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే రాజమండ్రి, తిరుపతిల రాకపోకల విమానాల షెడ్యూల్ ఇలా ఉంది. రోజు సాయంత్రం 4.50 గంటలకు ముంబైలో బయలుదేరి, 6.45 గంటలకు రాజమండ్రి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.15 గంటలకు ప్రారంభమై, 9.05 గంటలకు ముంబైకి చేరుకుంటుంది. మరో విమానం ఉదయం 5.30 గంటలకు ముంబైలో ప్రారంభమై, 7.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి 7.45 గంటలకు ప్రారంభమై, 9.25 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇప్పటి వరకు ముంబై వెళ్లాల్సి వస్తే హైదరాబాద్ మీదుగా చేరుకోవాల్సిన పరిస్థితి ఉండేది. తాజా సర్వీసులతో ప్రయాణ సమయంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతుందని సంతోషం వ్యక్తం అవుతోంది.
సర్వీసులు నడిపేందుకు ముందుకు వచ్చిన ఇండిగో...
రాజమండ్రి - ముంబై, తిరుపతి - ముంబై మధ్య సర్వీసులు నడిపేందుకు ఇండిగో విమానయాన సంస్థ ముందుకు వచ్చింది. దీంతో రాష్ట్రంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మరిన్నిసర్వీసులు పెరిగేలా ద్ర విమానయాన శాఖ మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు విమానయాన సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన కార్యాలయం చెబుతోంది.
భక్తులకు ప్రయోజనం..
తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా ముంబై, ఢిల్లీ తోపాటు దేశ నలుమూలల నుంచి తిరుపతికి తరలివస్తుంటారు భక్తులు.. అదేవిధంగా గోదావరి టూరిజం కోసంతోపాటు సినిమా షూటింగ్‌లు, ఇతర చమురు, సహజవాయు సంస్థల నిపుణులు, ఉద్యోగులు రాజమండ్రి విమానాశ్రయం ద్వారా వస్తుంటారు. రాష్ట్రంలో తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు అత్యంత కీలకం కాగా రద్దీగా కూడా ఉంటుంటాయి. ఈమధ్య వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా ముంబై నుంచి భక్తులు వస్తున్న పరిస్థితి ఉంది.
రాష్ట్రంలో తిరుపతి, రాజమండ్రికు రెండు విమానయాన సర్వీసులు మొదలు కావడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా రవాణాలో విమానయాన రంగం ప్రాధాన్యత రోజురోజుకూ పెరగడం ఆనందకరమని తెలిపారు. రాజమండ్రి నుంచి ముంబై మీదుగా విదేశాలకు వెళ్లే ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు, తిరుమల బాలాజీ ఆలయానికి చేరుకునే భక్తులకు ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో విమాన ప్రయాణీకులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని సర్వీసులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను మరింతగా అనుసంధానం చేసేందుకు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.