East Godavari News : తూర్పు గోదావరిలో కాపు ఓటు బ్యాంకుపై టీడీపీ గురి! సానా సతీష్ వ్యూహాలతో మారనున్న రాజకీయ సమీకరణాలు?
East Godavari Latest News: టీడీపీలో కాపు సామాజికవర్గంలో బలమైన నాయకత్వం కోసం ప్రయత్నిస్తుందా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతోన్న పరిణామాలను చూస్తే అవుననే అన్న చర్చ జరుగుతోంది.

East Godavari Latest News: ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయలపై కొన్ని సామాజిక వర్గాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఆ సామాజిక వార్గలు ఎవరి పక్షాన ఉంటే ఎన్నికల్లో ఆపార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పరిశీలిస్తే ఇది వాస్తవమనే భావన మరోసారి రుజువు అయింది. అందుకే ఏపీలో ప్రధాన పార్టీలన్నీ సామాజికవర్గాల వారీగా సమీకరణాలను తెర మీదకు తెచ్చి ఆయా సామాజిక వర్గాలను మచ్చిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంట్లో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా ముద్రపడిన కాపుల గురించి దృష్టిసారించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో ప్రధాన పార్టీలు ఆ దిశగా పావులు కదపడాన్ని చూస్తుంటే అవుననే సమాధానం లభిస్తోంది.
జనసేన ఆవిర్భావం తరువాత మారిన సీన్..
ఉభయగోదావరి జిల్లాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం ఉండదు. ఎందుకంటే గతంలో కూడా ఇలానే జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలు వ్యూహాలు రచిస్తుంటాయి. నాయకులను ప్రోత్సహిస్తూ ఉంటాయి. ప్రధానంగా తూర్పుగోదావరిలో కాపు సామాజికవర్గంలో ఇదే జరుగుతోంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గం చాలా వరకు టీడీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటుతో సీన్ కాస్త మారింది.
అగ్రభాగం కాపులు జనసేనలోకి మారిపోగా టీడీపీ తీవ్రంగా నష్టపోయింది. ఇది 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. 2024లో ఇటువంటి తప్పు జరగకుండా టీడీపీ ప్లాన్ చేసింది. జనసేన, బీజేపీతో కూటమిగా ఏర్పడి భారీ విజయాన్ని దక్కించుకున్న పరిస్థితి కనిపించింది. అయితే కాపుల్లో 80 శాతం జనసేన పార్టీలోకి మారడం వల్ల టీడీపీ తీవ్రంగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును కోల్పోయిన పరిస్థితి ఉండగా వైసీపీ కూడా కొంత కాపు సామాజికవర్గాన్ని కోల్పోయింది.
టీడీపీలో కాపులను బలపరిచేలా ప్రయత్నాలు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీలో కాపులను బలపరుచుకునేందుకు టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుందా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే ప్రయత్నం కాదు తీవ్ర ప్రయత్నమే చేస్తోంది. ఇందు కోసం రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తోంది. కాకినాడ జిల్లాలోని టీడీపీలో ఉన్న కాపులను ఐక్యపరిచి బలమైన నాయకత్వం నిర్మించే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా కాకినాడలో టీడీపీలో ఉన్న ముఖ్య కాపు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీ సానా సతీష్ ఇటీవలే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనూ ముఖ్యమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులతో సమావేశమయ్యారు.
కాపు యువ నాయకత్వం కోసమే..
టీడీపీలో కాపు సామాజిక వర్గం నుంచి నమ్మకమైన కాపు నేతలుగా ముద్రపడిన నిమ్మకాయల చినరాజప్ప, కొత్తపల్లి సుబ్బారాయుడు, బండారు సత్యానందరావు ఇలా కొందరు నేతలు ఉన్నప్పటికీ ఆర్ధికంగా ప్రస్తుతం సానా సతీష్ మాత్రమే ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి బాధ్యతలన్నీ ఆయనపైనే పెట్టే ప్రయత్నంలో టీడీపీ అధిష్టానం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు యువనేత లోకేష్ సానా సతీష్ మధ్య మంచి సంబంధాలు ఉండడం దీనికి బలాన్నిస్తున్నాయి. ఇప్పుడు సానా సతీష్ ద్వారా లోకల్‌గా మరింత మంది నాయకులను తీర్చిదిద్దాలని చూస్తున్నారు.





















