మాజీ సర్పంచ్ పంపన శ్రీనివాస్ పై వాసంశెట్టి సత్యం దాడి చేశారు. పార్టీ ఆఫీసులో ఈ సంఘటన జరిగింది.
Vasamsetti Subhash : మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇలాఖాలో తండ్రి పెత్తనం! టీడీపీకి నష్టం జరుగుతోందని కేడర్ అసహనం!
Vasamsetti Subhash : కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం మితిమీరిన పెత్తనంపై సొంత పార్టీలోని నాయకులు, కార్యకర్తలనే అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- మాజీ సర్పంచ్ పై మంత్రి తండ్రి దాడి, పార్టీలో దుమారం.
- కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం, కార్యకర్తలకు అన్యాయం.
- దాడి చేసి, బాధితులపైనే అట్రాసిటీ కేసులు నమోదు.
- మంత్రి తండ్రి పెత్తనం, సొంత పార్టీ నుంచే ఆరోపణలు.
Vasamsetti Subhash : పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యతనివ్వండి.. వైసీపీ నుంచి వలస వచ్చిన వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలుసార్లు యువనేత నారా లోకేష్ హెచ్చరించినా కొంత మంది టీడీపీ నాయకుల్లో ఏమాత్రం మార్పు కనిపించడంలేదు. సరిగ్గా ఇదే తరహాలో రామచంద్రపురం నియోజకవర్గంలో జరుగుతోందంటున్నారు టీడీపీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తలు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం మితిమీరిన పెత్తనంపై వారు మండిపడుతున్నారు. సొంత పార్టీలోని నాయకులు, కార్యకర్తలపైనే ఆయన జులం ప్రదర్శిస్తున్నారని భరించలేకపోతున్నామని వాపోతున్నారు. ఏ పని కోసం వెళ్లినా చేయకపోగా ఎదురు తిరిగితే దాడులు చేయిస్తున్నారని, పార్టీ పదవుల్లోనూ ఎప్పటినుంచో పార్టీజెండా మోసిన వారికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే కొనసాగితే పార్టీకు తీరని నష్టం తప్పదని మదన పడుతున్నారు..
దుమారం రేపిన పార్టీ మాజీ సర్పంచ్ పై దాడి..
సుదీర్ఘకాలంగా పార్టీలో ఉంటూ సర్పంచ్ గా పనిచేసిన వ్యక్తినే తన మాటకు ఎదురు తిరిగాడని మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం పార్టీ ఆఫీస్‌లోనే దాడికి దిగడం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు పంపన శ్రీనివాస్ మీడియా ముఖంగా తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతూ వాపోయాడు. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం శీల గ్రామానికి సర్పంచ్‌గా పని చేసిన శ్రీనివాస్ పార్టీకి వీరాభిమాని. శీల గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఇటీవల పార్టీలోకి వచ్చిన వ్యక్తికి కట్టబెట్టడంపై పంపన శ్రీనివాస్ ప్రశ్నించాడు. ఎప్పటి నుంచో పార్టీకి కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నానని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జెండా మోసిన తనను కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారని నిలదీశాడు. మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యంపై ఎదురు తిరిగాడు. ఈక్రమంలోనే సత్యంతో ఫోన్‌లో వాగ్వాదం జరిగిందని, తనను తీవ్ర పదజాలంతో మంత్రి తండ్రి ధూషించగా తానూ ధూషించగలనని ఘాటుగా సమాధానం చెప్పాడు. దీంతో తనను ఆఫీసు వద్దకు రావాలని ఇద్దరు టీడీపీ నాయకులను కారు ఇచ్చి పంపారని, అయితే తాను, తన కుమారుడు ఇద్దరూ కలిసి తమ కారులో వెళ్లామని చెప్పాడు. తమ ఫోన్లు తీసేసుకుని అందులో రికార్డింగ్‌లు డిలీట్ చేయడంతోపాటు తనపై, తన కుమారుడిపై మంత్రి తండ్రి సత్యం, అతని అనుచరులు విరుచుకుపడ్డారని, కాళ్ల మీద పడి ప్రాథేయపడినా వినిపించుకోకుండా తీవ్రంగా కొట్టారని చెప్పాడు. చివరకు తాను, తన కుమారుడు లేవలేని స్థితిలో ఉండగా బాబూ జగజ్జీవన్ రామ్ జయంతిరోజున మాదిగలను తిట్టినట్టుగా సంతకాలు చేయించుకున్నారని వాపోయాడు.
తీవ్రంగా కొట్టి తిరిగి కేసులు పెట్టారన్న బాధితుడు..
తీవ్రంగా కట్టి తమను రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించారని, ఆసమయంలో తమ పేరుమీద ఓపీ రాయమన్నా రాయలేదని వాపోయాడు.. ఉదయం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నామని తెలిపాడు. ఇదిలా ఉంటే రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌లో బాధితుడు పంపన శ్రీనివాస్, అతని కుమారుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తమను తీవ్రంగా కొట్టడమే కాకుండా తిరిగి కేసులు పెట్టారని బాధితులు మీడియా ముందు వాపోయారు..
మంత్రి తండ్రి పెత్తనంపై ఆరోపణలు..
రామచంద్రపురంలో ఎమ్మెల్యేగా వాసంశెట్టి సుభాష్ నెగ్గిన నాటి నుంచి ఆయన తండ్రి వాసంశెట్టి తండ్రి వాసంశెట్టి సత్యంపై తీవ్ర ఆరోపణలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ప్రతీ వ్యవహారంలోనూ ఆయనే అన్నీ తానై నడిపిస్తున్నారని, మంత్రి స్థానికంగా లేకపోతే మంత్రికి ఇచ్చే ప్రోటోకాల్ అంతా సత్యంకే ఇస్తారని పలువురు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయన తండ్రి సత్యం అనుచరులు వీరంగం సృష్టిస్తున్నారని, ఎదురుతిరిగితే వాళ్లు పార్టీవారైనా సరై దాడులకు దిగి రౌడీయిజం చెలాయిస్తున్నారని సొంత పార్టీకు చెందిన వారే ఆరోపించడం కనిపిస్తోంది. ఇదే కొనసాగితే సొంత పార్టీలోనే చాలా మంత్రి పక్క పార్టీలవైపు చూసే పరిస్థితి ఉంటుందోని, ఇప్పటికే టీడీపీలో అత్యంత విశ్వనీయుడుగా ఉన్న బాధితుడు పంపన శ్రీనివాస్ తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తున్న క్రమంలో మంత్రి తండ్రి సత్యంకు భయపడి ఎవ్వరూ వీరికి అండగా రాలేదని వాపోతున్నాడు.
గతంలో పలు వివాదాల్లో..
హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి రామచంద్రపురానికి వచ్చిన ఓ కుటుంబంపై కొంత మంది దాడిచేసిన ఘటనకూడా తీవ్ర కలకలం రేపింది.. ఇందులో దాడికి పాల్పడిన వారు మంత్రి సుభాష్ అనుచరులే అన్న విమర్శలు వెల్లువెత్తాయి. అదేవిధంగా అమలాపురంలో ఓ దళితునిపై మంత్రి అనుచరులే దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరకు ఈ రెండు ఘటనల్లోనూ వారు తన అనుచరులు కాదని మంత్రి సుభాష్ మీడియా ముఖంగా చెప్పుకున్నా అది నష్టనివారణ కాలేకపోయింది.
Frequently Asked Questions
వాసంశెట్టి సత్యం ఎవరిపై దాడి చేశారు?
దాడికి కారణం ఏమిటి?
శీల గ్రామానికి కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తికి కమటీ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని శ్రీనివాస్ ప్రశ్నించడంతో దాడి జరిగింది. దీనిపై వాసంశెట్టి సత్యంతో శ్రీనివాస్ ఫోన్ లో వాగ్వాదం జరిగింది.
దాడి తర్వాత ఏమైంది?
శ్రీనివాస్ మరియు అతని కుమారుడిని తీవ్రంగా కొట్టి, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వైద్యం చేయించుకున్న తర్వాత కూడా వారి పేరు మీద ఓపీ రాయలేదని బాధితులు వాపోయారు.
వాసంశెట్టి సత్యంపై ఏ ఆరోపణలున్నాయి?
మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం నియోజకవర్గ వ్యవహారాల్లో మితిమీరిన పెత్తనం చేస్తున్నారని, సొంత పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















