జంగారెడ్డిగూడెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన లిక్కర్ మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సంచలన విషయాలను వెల్లడించింది. అప్పట్లో ఇవి సహజ మరణాలని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, వాస్తవానికి మిథైల్ ఆల్కహాల్ కలిసిన నాటుసారా తాగడం వల్లే ఆ 25 మంది ప్రాణాలు కోల్పోయారని సిట్ తాజా నివేదికలో స్పష్టం చేసింది.

Continues below advertisement

మృతుల శరీరాల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ నివేదికలతో విశ్లేషించగా, అందులో ప్రమాదకరమైన మిథైల్ ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది. నాటుసారాలో ఈ రసాయనం కలిపితే మరణాలు సంభవిస్తాయని తెలిసినా వ్యాపారులు విక్రయించారని, అందుకే ఈ కేసులను కల్పబుల్ హోమిసైడ్ నాట్ ఎమౌంటింగ్ టు మర్డర్ (ఐపీసీ 304-2) సెక్షన్ కింద మార్చి దర్యాప్తు చేయాలని సిట్ నిర్ణయించింది.

ఫోరెన్సిక్ నివేదికను తారుమారు చేశారు..

Continues below advertisement

గత ప్రభుత్వ హయాంలో పోలీసులు ఈ కేసుల దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహించారని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఫోరెన్సిక్ నివేదికలను బయటకు రాకుండా తొక్కిపెట్టారని సిట్ అభిప్రాయపడింది. 2022 మార్చిలో ఒకే రకమైన లక్షణాలతో వరుస మరణాలు సంభవించినా, బాధితుల కుటుంబాలను కానీ, విక్రేతలను కానీ పోలీసులు విచారించలేదు. 2022 మార్చి నెలలో ఒకే లక్షణాలతో దాదాపు 25 మంది మృతిచెందడం తెలిసిందే. అయితే తాజాగా ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ నేతృత్వంలోని బృందం సైకలాజికల్ అటాప్సీ ద్వారా బాధితుల కుటుంబ సభ్యుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. మరణానికి ముందు బాధితులు కడుపునొప్పి, కళ్లు మసకబారడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారని తెలిపారు. దాంతోపాటు మృతుల శరీరాల్లో మిథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్లు తేలడంతో ఇవి ఖచ్చితంగా విషపూరిత మద్యం లక్షణాలేనని సిట్ నిర్ధారించింది.

సాధారణ మరణాలని అసెంబ్లీలో చెప్పిన వైఎస్ జగన్

నాడు అసెంబ్లీ వేదికగా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఇవి సాధారణ మరణాలని సర్టిఫై చేశారు. ఆ ప్రాంతంలో అనారోగ్య కారణాలతో ప్రజలు చనిపోవడం సాధారణమేనని, దీన్ని రాజకీయం చేయవద్దని అప్పట్లో అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వేసిన సిట్ విచారణలో విషయాలో మరోలా బయటకు వస్తున్నాయి. వైసీపీ హయాంలో నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం, ఉన్నవాటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో పేదలు నాటుసారా వైపు మళ్లారని సిట్ నివేదికలో పేర్కొంది.

35 నుంచి 45 ఏళ్ల వారే అధికం..

ఆ నాటుసారి తాగిన తరువాత కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, తల తిరగడం, నీరసంగా ఉండటం, కళ్లు మసకబారటం, తమకు ఏదో అయిపోతోంది అని బాధితులు ఆందోళన చెందేవారు. అస్వస్థతకు గురవుతున్న వారిని ఆస్పత్రుల్లో చేర్పించినా ప్రాణాలు దక్కలేదు. 35 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్నవారే అధికంగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే పారిశ్రామిక అవసరాలకు వాడే మిథైల్ ఆల్కహాల్ పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేయాలని సిట్ సిఫార్సు చేసింది. గత పాలకుల వైఫల్యాలు, పోలీసుల నిర్లక్ష్య్ం వల్లే భారీగా ప్రాణ నష్టం సభవించిందని సెట్ పేర్కొంది.