AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
కోనసీమ జిల్లా గాడిలంక సర్పంచి ఎన్నికల్లో అధికారుల అవకతవకల వల్ల 5 ఏళ్ల కింద ఓడిపోయిన అభ్యర్థి గెలిచినట్లు ముమ్మిడివరం జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జి ప్రకటించడంతో అంతా షాకయ్యారు.

Sarpanch Result in Konaseema | ముమ్మిడివరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 5 ఏళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రజల మద్దతుతో మెజార్టీ సాధించి సర్పంచ్‌గా ఎన్నికైనప్పటికీ.. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎన్నికల్లో నెగ్గారని అధికారులు ప్రకటించారు. దాంతో గత ఐదేళ్లు సర్పంచ్‌గా గ్రామానికి సేవలు అందించాల్సిన వ్యక్తి ఓటమితో కుంగిపోయాడు. ఓట్ల లెక్కింపు గోల్ మాల్‌పై పోరాటం చేసి విజయం సాధించినా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే సర్పంచ్ ల టర్మ్ సైతం ముగిసింది.
అసలేం జరిగిందంటే..
2021 ఫిబ్రవరి 21న ముమ్మిడివరం మండలం గాడిలంక పంచాయతీ సర్పంచి ఎన్నికల్లో అప్పటి అధికారులు ఓట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిని సర్పంచ్‌గా గెలిచినట్లు ప్రకటించారు. నాటి అధికార పార్టీ ఒత్తిళ్ల వల్ల రీకౌంటింగ్‌కు అవకాశం లభించలేదంటూ బాధితుడు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆ సర్పంచ్ ఎన్నిక చెల్లదని సోమవారం (ఏప్రిల్ 13న) సంచలన తీర్పునిచ్చింది.
న్యాయమూర్తి జస్టిస్ మహమ్మద్ రహంతుల్లా సమక్షంలో కోర్టులో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఎట్టకేలకు నిజాలు బయటపడ్డాయి. అప్పట్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారు పెద్దిరెడ్డి నాగమునీంద్రరావు 10 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లు అధికారులు ప్రకటించి ఆయనను సర్పంచ్ చేశారు. వాస్తవానికి 25 చెల్లని ఓట్లను ఆయన ఖాతాలో కలిపినట్లు తాజా లెక్కింపులో తేలింది. ఆ చెల్లని ఓట్లను తొలగించి తిరిగి లెక్కించగా, టీడీపీ మద్దతుదారు పెద్దిరెడ్డి వెంకటకృష్ణారావు 14 ఓట్ల ఆధిక్యంతో సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించినట్లు కోర్టు ప్రకటించింది.
దురదృష్టం ఏంటంటే, గెలిచినట్లు ప్రకటించిన వైసీపీ మద్దతుదారు మునీంద్రరావు ఐదేళ్ల పాటు సర్పంచ్‌గా పదవిలో కొనసాగారు. ఏప్రిల్ 2వ తేదీతో సర్పంచ్‌గా ఆయన పదవీకాలం కూడా ముగిసిపోయింది. ఈ సందర్భంగా బాధితుడు వెంకటకృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తనకు అండగా నిలిచి ఎన్నికల్లో గెలిపించినా అధికారుల మోసంతో తాను సర్పంచ్ పదవి ఒక్కరోజు కూడా చేపట్టలేకపోయానని వాపోయారు. ఎన్నికల ఫలితాలపై మొదట్నుంచీ తనకు అనుమానం ఉందని, అందుకే న్యాయం కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. చాలా ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని, నిజాలు బయటకొచ్చాయని.. అయితే అక్రమాలకు పాల్పడిన అప్పటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















