Jakkampudi Raja House Arrest: తెల్లవారుజామున జక్కంపూడి రాజా హౌస్ అరెస్ట్, ముందుగానే దీక్షను భగ్నం చేసిన పోలీసులు
రాజమహేంద్రవరం పేపర్ మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ దీక్షకు దిగడానికి కొన్ని గంటల ముందే జక్కంపూడి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Rajahmundry Paper Mills | రాజమహేంద్రవరం: రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దీక్ష భగ్నం చేసిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. గత తొమ్మిది రోజులుగా పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపై పోరాడుతున్న జక్కంపూడి రాజా మంగళవారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో సుమారు 150 మంది పోలీసులు వచ్చి.. తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కళ్యాణమండపంలో ఉన్న జక్కంపూడిని బలవంతంగా ఇంటికి తరలించి హౌస్ అరెస్ట్ చేశారు.
నేటి ఉదయం 9 గంటలకు ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో అప్రమత్తమైన పోలీసులు తెల్లవారుజామున భారీ సంఖ్యలో వచ్చి జక్కంపూడి రాజా ఆమరణ దీక్ష చేపట్టకుండా అడ్డుకుని ఇంటికి తరలించారు. పేపర్ మిల్లుకి 500 మీటర్ల దూరంలో ఏ విధమైన ఆందోళనలు, నిరసనలు చేపట్టకూడదు అని జక్కంపూడి రాజాను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి దీక్షను ముందస్తుగా భగ్నం చేశారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడుతున్నారు. మరో 50 మందిని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. .
జక్కంపూడి రాజా దీక్ష భగ్నం, హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..
— YSR Congress Party (@YSRCParty) July 22, 2025
-గత తొమ్మిది రోజులుగా పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న జక్కంపూడి రాజా గారిని అర్ధ రాత్రి సుమారు 150 మంది పోలీసులతో వచ్చి హౌస్ అరెస్ట్...
-తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం పేపర్ మిల్లు… pic.twitter.com/b1TBDb1gXE
ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటన
కార్మికుల సమస్యల పరిష్కారంలో ఏపీ పేపరు మిల్లు యాజమాన్యం దారుణంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్మికులకు వేతన ఒప్పందం, ఇతర సౌకర్యాల కల్పనలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కార్మికుల సమస్యను కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పరిష్కరిస్తారేమోనని ఏడాది సమయం వేచి చూశామన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మిల్లు యాజమాన్యంతో తాడోపేడో తేల్చుకునేందుకు మంగళవారం ఉదయం 9 గంటలకు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు సోమవారం ప్రకటించారు. పేపరు మిల్లు ఎదురుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష మొదలుపెడతానని స్పష్టం చేశారు.

గతంలో పేపర్ మిల్లులో 27 శాతం వాటా ప్రభుత్వానికి ఉండేదని, చంద్రబాబు సీఎం అయ్యాక ఆ వాటాను విక్రయించారని జక్కంపూడి రాజా ఆరోపించారు. గతంలో పేపర్ మిల్లుపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండేదని, కార్మికుల సమస్యలకు పరిష్కారం దొరికేదన్నారు. చంద్రబాబు పేపర్ మిల్లు వాటాలు అమ్మేశాక కార్మికుల సమస్యలు పెరిగాయని.. వేతన ఒప్పందంలో గత 30 ఏళ్లలో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదన్నారు. కొన్ని రోజులు వేచి చూడాలని కార్మిక సంఘాలు చెప్పడంతో ఇదివరకే రెండుసార్లు దీక్షను వాయిదా వేసుకున్నట్లు గుర్తుచేశారు.






















