చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామన్నారు జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్. 24 గంటలూ సెక్యూరిటీతోపాటు అడిషనల్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జైలులో తనకు ప్రాణహాని ఉందని న్యాయమూర్తికి చంద్రబాబు రాసిన లేఖపై రవికిరణ్ ప్రెస్‌మీట్ పెట్టారు.
రవికిరణ్ ఇంకా ఏమన్నారంటే... జైలు చుట్టూ ఐదు వాచ్‌టవర్స్ ఉన్నాయి. బీపీఓ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ జరుగుతుంది. ప్రతీ గంటకోసారి గార్డ్ సెర్చ్ చేస్తున్నాం. ఎస్పీతో మాట్లాడి ప్రత్యేకంగా సెంట్రల్ పోలీస్ లైన్ టీమ్‌తో జైలు చుట్టుపక్కలా పర్యవేక్షణ కూడా చేస్తున్నాం. ఈనెల 22వ తేదీన జైలు వాటర్ ట్యాంక్ వైపు ఒక డ్రోన్ తిరిగింది. ఈ సమాచారం నార్త్‌ఈస్ట్ వాచ్ టవర్ గార్డు అందించారు. అయితే, క్లోజ్డ్ జైల్ వైపు ఆ డ్రోన్ రాలేదు. దీనిపై మేం జైళ్లశాఖ నుంచి అధికారికంగానే సమీప పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చాం. ఆ తర్వాత జైలుపై ఎలాంటి డ్రోన్స్ తిరగలేదు.
మావోల పేరుతో వచ్చిన లేఖ ఒరిజినల్ కాదు. అది నకిలీ లేఖగా గుర్తించామన్నారు కిరణ్. చంద్రబాబుకు సంబంధించిన బెదిరింపు లేఖ ఫేక్ అని విచారణలో తేలిందన్నారు. జైలు నుంచి చంద్రబాబు రాశారంటూ బయటకొచ్చిన లెటర్‌కు జైలు అధికారుల అటెస్టేషన్ చేయలేదు. జైలులోకి వచ్చే ప్రతీ ఖైదీని పూర్తిగా తనిఖీ చేశాకనే లోపలికి అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. శ్రీనివాస్ అనే ఖైదీని రిమాండ్‌కు తెచ్చినప్పుడు ఆయన వద్ద ఒక బటన్ కెమెరా ఉన్నట్లు గుర్తించామని... అయితే వెంటనే దాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. దాన్ని తనిఖీ చేయగా అందులో ఎలాంటి జైలు ఫుటేజీ లేదని.. అతని ఫ్యామిలీ ఫోటోస్ రెండు ఉన్నాయన్నారు. తాము స్వాధీనం చేసుకున్న కెమెరాను కూడా పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. దాన్ని రిమాండ్ ఖైదీ ఎందుకు తెచ్చారనే విషయంపై దర్యాప్తు జరుగుతుందన్నారు. చంద్రబాబు వచ్చిన దగ్గర్నుంచీ గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరిన దాఖల్లాల్లేవని వివరించారు. అది ఎప్పటికీ జరిగే అవకాశమేలేదన్నారు.
చంద్రబాబు కుడి కంటి కేటరాక్ట్ ఆపరేషన్‌కు సంబంధించి రాజమండ్రి జీజీహెచ్ వైద్యులను సంప్రదించామని.. వారు పరీక్షలు చేశారని రవికిరణ్ వెల్లడించారు. చంద్రబాబుకు ఇమ్మెచ్చ్యూర్ కేటరాక్ట్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారన్నారు. కొంత సమయం తర్వాతైనా ఆపరేషన్ చేయించుకోవచ్చని వైద్యులు సూచించినట్టు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి తప్పుడు రిపోర్టు బయటకు ఇవ్వలేదన్నారు. ఆయన ఆరోగ్య నివేదికలను ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పిస్తున్నామని వివరించారు. జైల్లో భద్రతకు సంబంధించి స్నేహా బ్యారెక్‌లో చంద్రబాబును ఏ రూమ్‌లో ఉంచామన్న విషయం బయటకు వెల్లడించలేమన్నార. జైల్లో చంద్రబాబును ఫోటో తీసిన వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని... విచారణ కొనసాగుతుందని తెలిపారు.
చంద్రబాబు తనకు గతంలో ఉన్న ఎలర్జీల గురించి ప్రభుత్వ వైద్యులకు చెప్పారని...దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు రెండు లెటర్లు రాసినట్టు రవికిరణ్ వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యున్ని సంప్రదించి ఎలాంటి చికిత్స అవసరమో సూచనలు ఇవ్వాలని భువనేశ్వరికి కూడా అడిగినట్టు తెలిపారు. ఇదే విషయాన్ని కోర్టుకు వెల్లడించినట్టు పేర్కొన్నారు.
రాజమండ్రి ఎస్పీ జగదీష్ ఏమన్నారంటే?
రాజమండ్రి సెంట్రల్ జైల్ బయట వైపు 24 గంటలపాటూ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పకడ్బందీగా నిఘా ఉంటుందని జగదీష్ తెలిపారు. జైలు చుట్టుపక్కల అన్ని వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంటిన్యూస్ మానిటరింగ్ జరుగుతుందన్నారు. మావోయిస్టు లేఖ అనే దానిపై పూర్తిగా లోతైన విచారణ చేయించామని అది ఫేక్ లెటర్ అని గుర్తించామన్నారు.