రాజకీయం చేయాలంటే పెట్టిపుట్టనక్కర్లేదని గుండె ధైర్యం ఉంటే చాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని కొలవాలంటే గెలిచిన వ్యక్తిని చూడొద్దని, ఓడిపోయిన వ్యక్తి ఆ ఓటమిలో ఎలా ఉన్నాడో చూడాలని అన్నారు. కొబ్బరి పంటకు తెల్లదోమ ఆశించిందని, ఆంధ్రాకి కూడా వైసీపీ అనే తెల్లదోమ అందర్నీ పట్టి పీడిస్తోందని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో జనసేన పార్టీ వారాహి విజయయాత్ర నిర్వహించారు. ముమ్మిడివరంలో పవన్ కల్యాణ్ వారాహి వాహనంపై నుంచి మాట్లాడారు.
జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అసలైన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు.
‘‘ఇసుకను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. రెవిన్యూ, పోలీసు వ్యవస్థను వారి పనిని వారిని చేయనివ్వడంలేదు. జనసేనను నెగ్గిస్తే ఇసుకను ఉచితంగా అందజేస్తాం. ఉపాధికి అవకాశం కల్పిస్తాను. అధికారం లేకుండానే ప్రశ్నించేవాడు వస్తుంటే అధికార పార్టీకు వణుకు పుడుతుంది. 2024లో జనసేనకు అధికారం ఇస్తే అండగా నిలబడతాం. తెలంగాణా నుంచి ఆంధ్రా కొడుకులు అంటూ మనల్ని గెంటేశారు. నాకు తెలంగాణ అంటే అపారమైన ప్రేమ ఉంది.. ఇలా తిట్టినది అక్కడి నాయకులు. మనల్ని తన్ని తరిమిశారు. పోలీసులు అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. జనసేన ప్రభుత్వం రాగానే కొత్త రిక్రూట్‌మెంట్ తెస్తాం. పనిదినాలు తగ్గిస్తాం. పోలీసులు వ్యవస్థ మీద నాకు చాలా గౌరవం ఉంది.’’
వారు నాకంటే పెద్ద హీరోలు
‘‘సినిమా అనేది కేవలం వినోదంగానే చూడాలి. నాకు జూనియర్ ఎన్టీఆర్ అన్నా, మహేష్ బాబు అన్నా ఇలా ఎవరన్నా గౌరవమే. వారంటే నాకు ఇష్టం. మేం మాట్లాడుకుంటాం. ప్రభాస్, మహేష్ బాబు నా కంటే పెద్ద హీరోలు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి చేరుకున్నారు. ఈ విషయంలో నాకు ఎటువంటి ఇగోలు లేవు. అయితే, మీరు సినిమాల మీద ఇష్టం రాజకీయాల్లో చూపించకండి. రాజకీయాలు వేరు. సమాజానికి పోరాటం చేసేవారు కావాలి.. అన్యాయం జరుగుతున్నప్పుడు ఎలుగెత్తే నాయకులు, ఆడపడచులు కావాలి.
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా అంబేడ్కర్ పేరు పెట్టడం వల్ల కులాల మధ్య చిచ్చు పెట్టేవిధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది. నిఘా వర్గాలు ముందే హెచ్చరించాయి. నాయకుడు అంటే ప్రజలను కలపాలి కానీ విడగొట్టకూడదు. శెట్టిబలిజలను, కాపులను కలిపేందుకు నేను ప్రోత్సహించాను. కోనసీమ అద్భుతంగా ముందుకు వెళ్లాలంటే జీఎంసీ బాలయోగి ఆలోచనలనే స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంది. కోనసీమను అభివృద్ధి చేసే వరకు విశ్రమించను.
నాకు వ్యవసాయం మీద అవగాహన ఉంది - పవన్
రైతు తన నాలుగు శాతం వడ్డీ తానే కట్టుకున్నాడు. 70 మందికి పైగా వడ్డీ రాయితీ పడలేదు. క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలోనూ రైతులకు దగా జరుగుతోంది. ఈ ప్రభుత్వ చర్యల వల్ల రైతులు నష్టపోతున్నారు. కోనసీమలో పండిరచిన ప్రతీ దాంట్లో ఒక బస్తా ద్వారంపూడి కుటుంబీకులకు వెళ్తుంది’’ అని పవన్ కల్యాణ్ విమర్శించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial