Nara Lokesh: రాజమండ్రికి లోకేష్, మాజీ మంత్రులను మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు

Nara Lokesh: రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన తనయుడు నారా లోకేశ్ రాజమండ్రికి చేరుకున్నారు.

Continues below advertisement

Nara Lokesh: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కలవనున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంపై అన్ని వర్గాల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ వెళ్లిన లోకేశ్.. గురువారం రాత్రి రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ(శుక్రవారం) ఉదయం ఉండవల్లి నివాసం నుంచి నారా లోకేశ్.. రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరానికి బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర కూడా ఉన్నారు.

Continues below advertisement

అయితే వీరి వాహనాలు పొట్టిపాడు టోల్‌గేట్ వద్దకు రాగానే.. నారా లోకేశ్ వాహనాన్ని అనుమతించిన పోలీసులు.. మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర వాహనాలను మాత్రం అడ్డుకున్నారు. వారితో పాటు టీడీపీ శ్రేణులను పోలీసులు ముందుకు వెళ్లనీయకపోవడంతో టోల్‌గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులపై సీరియస్ అయ్యారు. లోకేశ్ వెంట రాజమండ్రికి వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులతో మాజీ మంత్రులు వాగ్వాదానికి దిగారు. 

రాజమండ్రికి వెళ్లాలంటే జగన్ మోహన్ రెడ్డి దగ్గర వీసా తీసుకోవాలా.. లోకేశ్ ని కలవాలంటే తాడేపల్లి ప్యాలెస్ అనుమతి కావాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజురోజుకీ నియంతపాలన కొత్త పుంతలు తొక్కుతూ, పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు. 

ఇదిలా ఉంటే.. చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లి నుంచి రాజమండ్రికి వెళ్తున్న లోకేశ్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి.. చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. మహిళా నేతలు మంగళహారతులు పట్టారు. చంద్రబాబుతో మేము, అంతిమ విజయం ధర్మానిదే అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. గన్నవరం, దెందులూరు నియోజకవర్గాల మహిళలు సంఘీభావం తెలిపారు. దారి వెంట తన కోసం ఎదురుచూస్తున్న మహిళలు, టీడీపీ శ్రేణులను నారా లోకేశ్ కారు ఆపి పలకరించారు. చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని, బలంగా ఉండాలని వారిలో ధైర్యాన్ని నింపి ముందుకు వెళ్లిపోయారు.

Continues below advertisement