సాధారణ తనిఖీల్లో భాగంగా రోడ్డుపై వెళ్తున్న వారిని ఆపి విచారణ చేస్తున్నారు పోలీసులు. పలు వాహనాలను నిలిపి సోదాలు చేస్తున్నారు. ఇంతలోనే అటువైపుగా ఓ వాహనంలో వెళ్తున్నవారిని కూడా ఆపారు. ఆ టైంలోనే వారి కదలికలపై అనుమానమొచ్చింది. ఏదో తేడా ఉందని గమనించి వారిని అదుపులోకి తీసుకుంటే ఘరానా దొంగల గుట్టు రట్టైంది.. ఫలితం రూ.50 లక్షల సొత్తు లభ్యమైంది.


తూర్పుగోదావరి జిల్లా అంబేడ్కర్‌ జిల్లా పరిధిల్లోకి వచ్చే మండపేట ఆలమూరు రోడ్డులో పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. స్థానిక వైష్ణవి ఐటీఐ కాలేజ్‌ వద్ద వాహనాలను ఆపి చెక్‌ చేస్తున్నారు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు మోటారు సైకిళ్లపై వెళుతూ అక్కడికి వచ్చారు. పోలీసులను చూసిన వెంటనే వారంతా పారిపోయేందుకు యత్నించారు. 


అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకున్నారు. పొంతన లేని సమాధానాలు, వారి కదలికలుపై అనుమానమొచ్చిన అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. పోలీసుల విచారణలో మైండ్‌ బ్లాక్‌ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయని రామచంద్రపురం డీఎస్పీ ప్రసాద్‌ వెల్లడించారు.


గుంటూరు జిల్లాకు చెందిన రాయపాటి వెంకయ్య, కుంభ సాంబ, వింజరపు శివ కుమార్‌రావు మండపేటతోపాటు ద్రాక్షారామం, రామచంద్రపురం, రావులపాలెం, అమలాపురం, పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం దొంగతనాలు చేసినట్లు విచారణలో బహిర్గతమైంది. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు కక్కారు ఘరానా దొంగలు. వీరు ముగ్గురు దొంగతనాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 


రూ.50 లక్షల సొత్తు స్వాధీనం


అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులకు ముగ్గురు ఘరానా దొంగల నుంచి రూ.50 లక్షలు విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దొంగల నుంచి 614 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కిలోల వెండి వస్తువులు, నాలుగు మోటారు సైకిళ్లు, ఒక ఆటో, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. 


ముగ్గురు నిందితులను చాకచక్యంగా పట్టుకున్న మండపేట టౌన్‌ సీఐ శ్రీధర్‌కుమార్‌, మండపేట టౌన్‌ ఎస్సై ఎం.అశోక్‌, కె.అప్పారావు, సిబ్బంది సీహెచ్‌ ఏసుకుమార్‌, ఎన్‌.సతీష్‌, పీవీవీఎస్‌ నారాయణను డీఎస్పీ టీఎస్‌ఆర్కె ప్రసాద్‌ అభినందించి నగదు బహుమతులు అందజేశారు.