Leopard Wandering in Konaseema District | రాజమండ్రి: గత పదిహేడు రోజులుగా రాజమండ్రి శివారు దివాన్‌చెరువు, లాలాచెరువు పరిసర ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసిన చిరుతపులి తాజాగా రూట్‌ మార్చింది. చిరుత రాజమండ్రి రూరల్‌ కడియం మండలం వైపు దౌడుతీస్తోంది. తాజాగా కడియం మండల పరిధిలోని కడియం - వీరవరం రోడ్డు మధ్యలో ఉండే దోషాలమ్మ కాలనీలో ఈచిరుత పులి పగ్‌ మార్కులు కనిపించడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 


కడియపులంక పరిసర ప్రాంతాల్లో భయం భయం 
తూర్పు గోదావరి జిల్లా అటవీశాఖ అధికారి ఎస్‌.భరణి నేతృత్వంలో కొందరు అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని పాదముద్రలను గుర్తించి చిరుతపులిగా నిర్ధారించినట్లు వెల్లడించారు. అయితే కడియం మండల పరిధిలోని కడియపులంక ప్రాంతంలో వందల సంఖ్యలో నర్సరీలు ఉండడంతో అక్కడ నిత్యం వ్యాపార కార్యకలాపాలు, పనులు చక్కబెట్టుకునే వారు మాత్రం చిరుతపులి భయంతో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


నాలుగు రోజులుగా కనిపించని చిరుత.. 
దివాన్‌ చెరువు సమీపంలో ఉన్న సుమారు 950 ఎకరాల అటవీభూముల్లో తిష్టవేసిన చిరుత పులి రాత్రివేళల్లో దివాన్‌ చెరువు, లాలా చెరువు ప్రాంతాల్లో సంచరించింది. చిరుత సంచారంతో అక్కడి పరిసర ప్రాంతాలైన హౌసింగ్‌బోర్డు కాలనీ, ఆటోనగర్‌, స్వరూపనగర్‌, శ్రీరూపా నగర్‌, శ్రీరామ్‌ నగర్‌ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అక్కడ సుమారు 100 వరకు ట్రాప్‌కెమెరాలు, 15 వరకు ట్రాప్‌ కేజ్‌(బోన్లు)ను అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసినా కేవలం ట్రాప్‌ కెమెరాల్లోనే చిక్కిన చిరుతపులి బోన్లు వైపునకు అసలు రాలేదు. అయితే నాలుగు రోజులుగా అడవిలో కానీ, పరిసర ప్రాంతాల్లో చిరుతపలి జాడ కనిపించలేదు.  దీంతో అటవీశాఖ అధికారులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి.. చిరుత పులి సమాచారం తెలియడంలేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 


చిరుత ఎక్కడికి వెళ్లినట్లు..?


ఇప్పుడు రాజమండ్రి రూరల్‌ కడియం మండలంలో చిరుతపులి భయం పట్టుకుంది. కడియం మండలంలో వందల సంఖ్యలో నర్సరీలు ఉండడంతో అక్కడ గాని చిరుతపులి జాడ లభిస్తుందేమోనని దాదాపు నర్సరీల సీసీ కెమెరాలను పరిశీలించే పనిలో పడ్డారు అధికారులు. కడియం మండల పరిధిలో ఉండే దోషాలమ్మకాలనీలో కనిపించిన పాదముద్రలను పరిశీలించిన అధికారులు మాత్రం అవి చిరుత పగ్‌ మార్కులుగా నిర్ధారించారు. కానీ రాజమండ్రి దివాన్‌చెరువు ప్రాంతం నుంచి చిరుతపులి ఇంతవేగంగా కడియం వైపుగా ఎలా వచ్చిందన్నది మాత్రం పాలుపోని పరిస్థితిగా కనిపిస్తోందని తెలుస్తోంది.. గంటకు 100 కిలోమీటర్లుకుపైగా వేగంగా కదిలే చిరుత అంతకంటే వేగంగా ముందుకు వెళ్లగలదని, అయితే వీరవరం, కడియం తదితర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మాత్రం సూచిస్తున్నారు. 


మండపేట, ఆలమూరు మండలాలవైపుగా... 
కడియం మండలాన్ని ఆనుకుని మండపేట, కొత్తపేట నియోజకవర్గాలు ఉండగా అటు మండపేట మండల పరిధిలోకి వచ్చే కేశవరం మీదుగా ఇలా వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు అటు ద్వారపూడి వైపునకు కానీ, ఇటు కడియం మండలం మీదుగా ఆలమూరు కానీ చిరుత వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లేదా పచ్చని ప్రదేశంగా ఉండే కడియపులంక నర్సరీలు కూడా చిరుతపులి సంచారం చేసేందుకు అనువుగా ఉండడంతో ఇక్కడే తిష్టవేసే అవకాశం లేకపోలేదంటున్నారు. మొత్తం మీద రాజమండ్రి రూరల్‌ మీదుగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వైపుగా చిరుతపులి మాత్రం పయనిస్తుందని అధికారులు భావిస్తున్నారు..


కడియం నర్సరీలను పరిశీలించిన ఎఫ్‌డీవో భరణి..


కడియం మండలంలోని కడియపులంకలో చిరుతపులి సంచారంపై తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జ్‌ అటవీశాఖ అధికారిని ఎస్‌.భరణి సిబ్బందితో అక్కడికి వెళ్లారు. చిరుత పాదముద్రలను పరిశీలించారు. కడియపులంకలో కూడా ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా చిరుతపులి సంచారం గురించి ఎటువంటి సమాచారం అందినా వెంటనే తెలియజేయాలని, కడియపులంక నర్సరీలో రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.