Konaseema News: కుమారుడు బ్రెయిన్ డెడ్ అయినా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపిన తల్లిదండ్రులు!
ఉప్పెనలా ఉబికి వస్తున్న కన్నీటి సంద్రాన్ని దిగమింగుకొని తమ కుమారుడిని మళ్లీ జన్మించేలా చేయాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు.. బ్రెయిన్ డెడ్‌కు గురైన బాలుడి అవయవాలు దానం చేసి నలుగురికి జీవం పోశారు..

కొంత మంది చనిపోయినా ప్రజల్లో సజీవంగా ఉంటారంటుంటారు.. ఎందుకంటే వారు బ్రతికుండగా చేసిన మంచి పనులు వారు మృతిచెందినా ప్రజల మనస్సుల్లో వారిని సజీవంగా ఉంచుతాయి.. అయితే ఎనిమిదేళ్ల కుర్రాడు అయితే చనిపోయినా నలుగురికి ప్రాణదానమిచ్చి సజీవంగా ఉన్నాడని గుండెలను పిండేసే బాధలోనూ సంతోషంగా చెబుతున్నారు ఆ తల్లితండ్రులు..రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ గురైన కుమారుడి అవయవాలు అవసరమైన వారికి దానం చేసి వారిలో తమ కుమారుడి జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు.. ఆ తల్లితండ్రులు.. వారు చేసిన ఈ పనికి అంతా వారిని ధైర్యం చెబుతూనే అభినందిస్తున్నారు..
కన్నబిడ్డను లేకుండా చేసిన రోడ్డు ప్రమాదం..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరు గ్రామం ఇందిరానగర్ కాలనీకు చెందిన బడుగు భరత్ అనే ఎనిమిదేళ్ల బాలుడు ఇటీవలే పేరూరు వద్ద స్కూల్‌కు వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా ఓ స్కూటరిస్ట్ ఢీకొట్టాడు.. ఈ ప్రమాదంలో బాలుడు భరత్ తీవ్ర గాయాల పాలయ్యాడు.. బాలుడి తలకు తీవ్ర గాయం కావడంతో హుటాహుటీన అమలాపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.. అయితే పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనతో మళ్లీ కాకినాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ బాలుడు భరత్‌కు అత్యవసర చికిత్స అందిస్తున్నా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు..
పిడుగులాంటి వార్త చెప్పిన వైద్యులు..
కాకినాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో బాలుడు భరత్‌కు చికిత్స అందిస్తుండగా ఈక్రమంలోనే బిడ్డ అంతా బాగుపడి అపస్మారక స్థితి నుంచి బటకు వస్తాడని, తమను గుర్తుపడతాడని భావించిన కన్నవారికి నిరాశే ఎదురయ్యింది.. ఈ పరిస్థితుల్లోనే పిడుగులాంటి వార్త కన్నవారికి చెప్పారు వైద్యులు.. మీ కుమారుడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని, భరత్ కోలుకోవడం కష్టం అని చెప్పడంతో గుండెలవిసేలా రోదించారా తల్లితండ్రులు...
మీ బిడ్డ మళ్లీ జన్మిస్తాడని నచ్చచెప్పి...
తమ బిడ్డ ఎలాగైనా బ్రతుకుదాడని ఆశించిన తల్లితండ్రులకు నిరాశే ఎదురవ్వడంతో శోక సంద్రంలో మునిగిపోయారు.. చిన్నారి భరత్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు చెప్పాక కాస్త సమయం గడిచాక బాలుడు మృతి చెందక ముందే అవయవాలు దానం చేస్తే అతను మరణించినా వేరొకరి రూపంలో బ్రతికే ఉంటాడని వైద్యులు సూచించడంతో అవసరం అయిన వారికి భరత్ అవయవాలు దానం చేయాలని బాలుడు తండ్రి బడుగు వెంకటరమణ, తల్లి, కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.. అయినా ఉప్పెనలా ఉబికి వస్తున్న కన్నీటి సంద్రాన్ని దిగమింగుకొని తమ కుమారుడిని మళ్లీ జన్మించేలా చేయాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు... దీంతో కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రికి కిడ్నీలు, చెన్నై లో చికిత్స పొందుతున్న రోగులకు గుండె, ఊపిరి తిత్తులు, వైజాగ్ కు మరో అవయవం తరలించారు. తమ కుమారుడు చనిపోయినా తన అవయవాలతో మరొకరికి ప్రాణం పోసి సజీవంగా ఉంటాడని.. ప్రాణాలతో పోరాడుతున్న కొందరికి జీవితాన్ని ప్రసాదించి వారిలో మళ్లీ జన్నిస్తాడని ఆ తల్లితండ్రులు గద్గద స్వరంతో చెప్పడం అక్కడున్నవారికి కన్నీటి పర్యంతం చేసింది..
మీ బిడ్డ నలుగురిలో జీవిస్తున్నాడు..
తాను మృతిచెందినా తన అవయవాలతో నలుగురిలో బ్రతికే ఉన్నాడని బాధాతప్త హృదయాలతో కన్నీరుమున్నీరవుతున్న తల్లితండ్రులను పలువురు ఓదార్చి ధైర్యం చెబుతున్నారు.. ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో ఎంతో మంది నెటిజన్లు అవయువదానం చేసిన బాలుడి ఫోటో కింద రియల్ హీరో అని కామెంట్ చేస్తున్నారు.























