Konaseema Crime News: గతంలోనే వారికి వివాహాలు అయ్యాయి. అతను భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఆమె భర్త నుంచి విడిపోయి ఉంటోంది. ఇద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. వీరికి ఒక పాప కూడా జన్మించింది. ఇద్దరి మద్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరి ఆమె హైదరాబాద్‌ వెళ్లి ప్రయివేట్‌గా జాబ్‌ చేసుకుంటోంది. సీన్‌ కట్‌ చేస్తే ఆమె పంటకాలువలో మృతదేహమై కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రియుడు పరారీలో ఉండగా ఈ కేసుపై మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి.


అమలాపురం పట్టణం వనచర్లవారి వీధికి చెందిన గాది నాగబాబు అలియాస్‌ చిన్న మల్లేశ్వరి గత మూడేళ్లుగా కలిసి సహజీవనం చేస్తున్నారు. గతంలో వీరికి వివాహాలు కాగా నాగబాబు తన భార్యను, మల్లీశ్వరి తన భర్తను వదిలేశారు. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. ఈ క్రమంలోనే వీరిద్ధరికి కొంత మనస్పర్ధలు రాగా మల్లీశ్వరి హైదరాబాద్‌ వెళ్లి అక్కడే ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటుంది. ఈనెల 5న డ్వాక్రా డబ్బులు తీసుకునేందుకు హైదరాబాద్‌ నుంచి అమలాపురం వచ్చింది. 


అకస్మాత్తుగా అదృశ్యం అయిన మల్లీశ్వరి..
హైదరాబాద్‌ నుంచి అమలాపురం వచ్చిన మల్లీశ్వరి ఈనెల 6వ తేదీనుంచి కనిపించకుండా పోయింది. ఆమె తండ్రి శ్రీపతి రాంబాబు, బంధువులు ఆమె ఆచూకి కోసం గాలిస్తున్నారు. నాగబాబు తమ కుమార్తెను బంధువుల ఇంట్లో ఉంచి ఎక్కడికో వెళ్లిపోయాడు. మల్లీశ్వరి కనిపించకుండా పోవడం, నాగబాబు కూడా అదృశ్యం అవ్వడంపై మల్లీశ్వరి కుటుంబికుల్లో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇంత ప్రయత్నించినా ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో శనివారం రాత్రి అమలాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత అదృశ్యంగా నమోదు చేసిన పోలీసులు అనుమానస్పద కేసుగా మార్చారు.


ముమ్మాటికీ హత్యే అంటున్న బంధువులు..
నాగబాబుతో కలిసి సహజీవనం చేస్తున్న మల్లీశ్వరి హైదరాబాద్‌ వెళ్లిపోవడానికి కారణం ఇద్దరి మద్యలో తారాస్థాయిలో మనస్పర్ధలు రావడమే కారణమని తెలుస్తోంది. నాగబాబు మల్లీశ్వరిపై అనుమానం పెంచుకున్నాడని, అదేవిధంగా మల్లీశ్వరి మరొకరితో చనువుగా ఉంటుందన్న విషయంలోనూ నాగబాబు మల్లీశ్వరిపై కొంత ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే మృతురాలు హైదరాబాద్‌ వెళ్లిపోయిందని తెలుస్తోంది. మృతురాలి బంధువులు మాత్రం ప్రియుడు నాగబాబు పైనే అనుమానం వ్యక్తం చేస్తుండగా పోస్ట్‌మార్టం నివేదిక రాగానే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.