ఆంధ్రప్రదేశ్ లో పాలన మారాలంటే పాల్ రావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో కోతకు గురవుతున్న భూములను ఆ ప్రాంత రైతులతో కలిసి పరిశీలించారు. ప్రతి ఏడాది గోదావరికి వచ్చే వరదల వలన సారవంతమైన లంక భూములు పదుల సంఖ్యలో ఎకరాలు కోతకు గురై రైతులు ఆందోళన చెందుతుంటే ఈ ప్రభుత్వాలకు చీమైనా కుట్టడం లేదని దుయ్యబట్టారు. ఈ భూములు చాలా విలువైనవని, ఐదు ఎకరాలు అమ్మితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బుతో గోదావరి వెంబటి ఉన్న లంక పొలాలు నది కోతకు గురవకుండా పూర్తిస్థాయిలో గ్రోయన్స్ నిర్మించవచ్చని అన్నారు. ఈ చిన్నపాటి సూత్రాన్ని కూడా ఈ ప్రభుత్వాలు తెలుసుకోలేకపోవడం చాలా ఘోరమని విమర్శించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల గోస అవసరం లేదని వారి విలాసాలకే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అన్నారు. ప్రజలు ఓట్లను అమ్ముకుంటే ఇలాంటి పరిస్థితులే చూడవలసి వస్తుందని అన్నారు. ఎలాగైనా గెలవాలనే సిద్ధాంతాన్ని నమ్మే ఎన్నికల సమయంలో అవినీతి సొమ్మును ప్రజలకు పంచుతున్నారని అన్నారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీని విడిచి బయటకు వచ్చి ప్రజాశాంతి పార్టీతో కలిసి పోటీ చేయాలని అన్నారు.
‘‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోదీని గెలిపించమని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి వెళ్లి మోదీకి మసాజ్ చేస్తారు. మన ఆస్తుల్నే వాళ్లు దోచుకుంటున్నారు. 8 లక్షల కోట్ల విలువ చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంటును అంబానీ, ఆదానికి 5 వేల కోట్లకి ఇచ్చేయబోయారు. నేనే ఆపాను. పోరాడుతున్నాను. అధికారంలో లేనప్పుడు ఇంత చేశాను. ఇప్పటికే లక్ష కోట్లు తెస్తానంటే నన్ను తేనివ్వడం లేదు. మీడియా వాళ్లు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. కానీ, ఈ రాజకీయ నాయకులు పట్టించుకోట్లేదు’’ అని కేఏ పాల్ అన్నారు.
బడుగువాని లంక ప్రాంతంలో కేఏ పాల్ పర్యటిస్తుండగా, నదీ తీరంలో ఓ శవం కొట్టుకొని వచ్చింది. అది చూసిన కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పోలీసులకు చేరే వరకూ మీడియా వారు సహకరించాలని కోరారు. ఆ శవం ఎవరిదో పోస్టు మార్టం చేయించి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత వ్యక్తి కుటుంబానికి న్యాయం జరగాలని కోరారు.