విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా కోర్టులో కేసు వేశామని, ఈ న్యాయ పోరాటంలో తాము గెలుస్తామని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం రాత్రి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా కోర్టులో గెలుస్తామని పాల్ అన్నారు.  రాష్ట్రంలో 31 లక్షల మంది ప్రజాశాంతి పార్టీలో ఇప్పటిదాకా చేరారని, రిటైర్డ్ డీజీపీ శాంఘియా, ఐఏఎస్ రోశయ్య, డాక్టర్ కుమార్ గౌడ్ తో పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అనేక మంది చేరారని తెలిపారు. ప్రజాశాంతి పార్టీ దేశ వ్యాప్తంగా బలోపేతం కావడానికి పునాదులు వేస్తున్నామని అన్నారు. 


గ్రామానికి కోటి రూపాయల నిధులు, సర్పంచుకి 25 వేల జీతం - కేఏ పాల్


పది లక్షల కోట్ల అప్పు చేసిన ఈ సీఎంలు కావాలా, గ్రామానికి కోటి రూపాయల నిధులు.. సర్పంచుకు 25 వేల జీతం ఇచ్చే కేఏ పాల్ కావాలా అని నిర్ణయించుకోవాలని అన్నారు. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం కోసం ప్రజాశాంతి పార్టీ పనిచేస్తుందని చెప్పారు. పది లక్షల కోట్ల అప్పు రాష్ట్రంపై ఉందని, దానికి వడ్డీ కట్టే పరిస్థితి కూడా ప్రస్తుతం రాష్ట్రంలో లేదని అన్నారు. ఆ అప్పులు తీర్చగలిగి, బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, అలాగే హోదాను చంద్రబాబు తీసుకురాలేకపోయారని అన్నారు. జగన్ కాళ్లు కట్టేశారని ఎద్దేవా చేశారు. సమయం లేదు, ఏడాది మాత్రమే ఉందని ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా శాంతి పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలతో ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన వెంట ప్రజాశాంతి పార్టీ నేత డాక్టర్ కుమార్ తదితరులు ఉన్నారు.